గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ సుమారు 139 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత బుధవారం విడుదల అయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేయడంతో.. విజయవాడ సబ్ జైలు నుంచి ఆయన నిన్న బయటకు వచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ తదితరులు జైలు వద్దకు చేరుకుని వంశీకి ఘన స్వాగతం పలికారు.
అయితే నిన్న జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ.. నేడు వైసీపీ అధ్యక్షడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వంశీ మరియు ఆయన సతీమణి పంకజశ్రీ ఇవాళ తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి కలిశారు. కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన అధినేతకు వంశీ కృతజ్ఞతలు తెలిపారు.
జైలులో ఉన్న సమయంలో వంశీ పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. ఇరువురి మధ్య జైలు జీవితం, ప్రస్తుత పరిణామాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిని అపహరించి బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో 2025 ఫిబ్రవరి 13న వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత వివిధ స్టేషన్లలో దాదాపు 11 కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. ఈ కేసుల కారణంగానే సుమారు నాలుగున్నర నెలల పాటు జైల్లో మగ్గిపోయిన వంశీ ఫైనల్‌గా బయటకు వచ్చింది. ఇక ఆరోగ్యం కుదుటి పడిన తర్వాత మళ్లీ ఆయన పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారా? లేక సైలెంట్‌గానే ఉంటారా? అన్నది చూడాలి.