రిలీజ్ అయిన సినిమా అదే రోజు బయటకు వచ్చేయటం.. రాకెట్ స్పీడ్ తో ఉండే పైరసీ భూతానికి సంబంధించిన రాకెట్ ను ఛేధించారు.దీనికి కారణమైన ఒక ముదురు కేసును అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. రిలీజ్ అయిన రోజునే మిగిలిన ప్రేక్షకుల మాదిరి థియేటర్ కు వెళ్లి.. గుట్టు చప్పుడు కాకుండా రికార్డు చేసే వైనాన్ని గుర్తించారు. ఇప్పటివరకు ఇతగాడు 60 సినిమాల్ని పైరసీ చేసినట్లుగా గుర్తించారు. ఏడాదిన్నర వ్యవధిలో 40 సినిమాల్ని పైరసీ చేసిన వైనాన్ని సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల కిరణ్ కుమార్ వనస్థలిపురంలో ఉంటాడు. ఏసీ టెక్నిషియన్ గా పని చేస్తుంటాడు. ఇన్ స్టాలో ఒక పైరసీ గ్రూపు లింకును చూసిన ఇతను.. దాని నిర్వాహకుల్ని ప్రోటాన్ మొయిల్ ద్వారా సంప్రదించాడు. సినిమాల్ని పైరసీ చేసి పంపేలా వారితో డీల్ కుదుర్చుకున్నాడు.
అప్పటి నుంచి రిలీజ్ వేళ.. థియేటర్ కు వెళ్లి చొక్కా జేబులో హెచ్ డీ కెమెరా పెట్టుకొని రికార్డు చేసేవాడు. ఆ తర్వాత ఆ వీడియోను టెలిగ్రామ్ ద్వారా పైరసీ వెబ్ సైట్ కు పంపేవాడు. ఒక్కో సినిమాకు 300 - 400 డాలర్లు చొప్పున క్రిప్టో కరెన్సీ తీసుకునేవాడు. అనంతరం మామూలు రూపాయిలుగా మార్చుకునేవాడు. ఇటీవల విడుదలైన కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ అయిన రోజునే పైరసీ బయటకు రావటంతో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు.
ఇక్కడో మరో విషయాన్ని చెప్పాలి. థియేటర్ లో సినిమా రన్ అవుతున్నప్పుడు.. సాధారణ ప్రేక్షకుడు గుర్తించలేని విధంగా సినిమా మధ్య మధ్యలో వాటర్ మార్కు వచ్చి వెళుతూ ఉంటుంది. ఎవరైనా గుట్టు చప్పుడు కాకుండా రికార్డు చేస్తే.. అందులో ఈ వాటర్ మార్కు కనిపిస్తుంది.దీంతో.. ఏ థియేటర్ లో రికార్డు చేసింది గుర్తించొచ్చు. అదే విధంగా ఈ పైరసీకి సంబంధించిహైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ థియేటర్ లో పైరసీ చేసిన విషయాన్ని గుర్తించారు.
అనంతరం సదరు థియేటర్ కు వెళ్లి.. ఏవైపు నుంచి సినిమాను రికార్డు చేసింది గుర్తించారు. అనంతరం ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ద్వారా తొలుత నలుగురిని గుర్తించారు. అనంతరం మరింత వడపోతల అనంతరం కిరణ్ కుమార్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఇతను 65 సినిమాలను పైరసీ చేశాడని.. ఏడాదిన్నరలో 40 సినిమాలకు పైనే పైరసీ చేసిన విషయాన్ని గుర్తించారు. ఇతడ్ని విచారిస్తే మరిన్ని పైరసీ ముఠాల సమాచారం వెలుగు చూస్తుందని భావిస్తున్నారు.