కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ పాలనపై, జగన్ పాలనా దక్షతపై సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో వైసీపీ నాయకులకు పవన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ పాలనలో ప్రజలతో పాటు అధికారులు కూడా భయపడ్డారని, చంద్రబాబును కూడా నానా ఇబ్బందులు పెట్టారని గుర్తుచేశారు. ఏపీకి భవిష్యత్తు ఉంటుందా అనే అనుమానం కలిగేలా జగన్ పాలన సాగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకుంటే రాష్ట్ర పరిస్థితి ఏమై ఉండేదో ఊహించడానికే భయంగా ఉందని అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఏకైక లక్ష్యంతో తామందరం కూటమిగా ఏర్పడి ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్నా కూడా వైసీపీ నేతలు ఆగడాలు కొనసాగిస్తున్నారని పవన్ ఫైర్ అయ్యారు. “గొంతులు కోస్తామంటూ బెదిరింపులకు పాల్పడితే, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. వైసీపీకి కనీసం ప్రతిపక్షానికి అవసరమైన సంఖ్యా బలం కూడా లేదు. అయినా వారి వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. మేము చట్టానికి లోబడి వ్యవహరించాలి కాబట్టి సంయమనంతో ఉంటున్నాం. ఎన్నో అవమానాలు, దెబ్బలు తిని ఈ స్థాయికి చేరుకున్నాం. ఎవరైనా పిచ్చివేషాలు వేసి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూస్తే ఉపేక్షించేది లేదు. అలాంటి వారిని తొక్కి నారతీస్తాం” అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.