‘మ్యాగజైన్ స్టోరీ’..తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణ కాదు.. ప్రక్షాళన?

admin
Published by Admin — March 12, 2025 in Politics
News Image

తెలంగాణ లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది దాటిపోయింది. కానీ, మంత్రివర్గం మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. 2023 డిసెంబరులో మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తనతోపాటు మరో 11 మందితో మాత్రమే క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. సీనియర్లు, సామాజికవర్గాల కూర్పు, రాజకీయ అవసరాల ఆధారంగా 11 మంది మంత్రులను నియమించారు.


ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 18 మందికి చోటు కల్పించే వీలున్నా.. మిగిలిన ఆరు స్థానాలకు తరువాత మంత్రివర్గ విస్తరణ చేపడతామని ప్రకటించారు. కానీ, ఏడాది కాలంగా విస్తరణ జరపడంలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో ఇది వాయిదా పడుతూ వస్తోంది. వరుసగా లోక్‌సభ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్‌ అధిష్ఠానం బిజీగా ఉండడంతో విస్తరణ సాధ్యపడలేదు.


ఇప్పుడు అన్ని ఎన్నికలూ పూర్తయ్యాయి. అధిష్ఠానం కూడా తెలంగాణలో ప్రభుత్వంతోపాటు పార్టీ పనితీరుపైనా దృష్టి పెట్టింది. మరోవైపు మంత్రి పదవి కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తమకు అవకాశం దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. అయితే మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఎవరికి వారు తమనే కేబినెట్‌లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు.

మరికొందరైతే నేరుగా అధిష్ఠానం వద్దకే వెళ్లి అర్జీలు పెట్టుకుంటున్నారు. దీంతో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ మంత్రివర్గ విస్తరణకు పార్టీ పెద్దల నుంచి అనుమతి కోసమే వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం.. అటు నుంచి అటే సింగపూర్‌, దావోస్‌ పర్యటనలకు వెళ్లారు. ఆయన ఆ పర్యటనల నుంచి తిరిగి వచ్చాక ఈసారి విస్తరణ ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. కానీ, ఈసారి జరగబోయేది మంత్రివర్గ విస్తరణ కాదని, ప్రక్షాళన అని కొత్త ప్రచారం మొదలైంది.

ఆ ముగ్గురిపై అధిష్ఠానం అసంతృప్తి?

ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు మంత్రుల పనితీరుపై కాంగ్రెస్‌ అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్‌ పనితీరుపై అధిష్ఠానం ఇటీవల సర్వే చేయించినట్లు, అందులోనే ఈ విషయం వెల్లడైనట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పలువురు మంత్రుల పనితీరు బాగాలేదని, వారు మెరుగుపడాలని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే ఆ ముగ్గురిని ఉద్దేశించే వేణుగోపాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. వీరిలో ఒకరు పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో పార్టీకి, ప్రభుత్వానికి సమస్యగా మారుతున్న మంత్రి అని అంటున్నారు. మరో మంత్రిపై అవినీతి ఆరోపణలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకొకరు పార్టీని, ప్రభుత్వాన్ని తగినవిధంగా సమర్థించకుండా సొంత ఎజెండాతో పనిచేస్తున్న మంత్రి అని ప్రచారం జరుగుతోంది.


మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఈ ముగ్గురికి ఉద్వాసన పలకాలనే యోచనలో అటు అధిష్ఠానంతోపాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి తొలగింపుతో ఖాళీ అయ్యే మూడు స్థానాలతోపాటు మరో నలుగురిని కొత్తగా క్యాబినెట్‌లోకి తీసుకుంటారని, రెండు బెర్తులను మళ్లీ ఖాళీగానే ఉంచుతారని అంటున్నారు. దీంతో పదవి కోల్పోయేది ఎవరో, కొత్తగా మంత్రులు అయ్యే ఏడుగురు ఎవరో అన్న ఉత్కంఠ నెలకొంది.

విస్తరణలో జాప్యం అందుకే!

మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతుల్యతను కూడా పాటించాల్సి ఉండడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న 11 మంది మంత్రుల్లో.. సీఎం కాకుండా ముగ్గురు మంత్రులు రెడ్డి సామాజికవర్గం వారున్నారు. వీరితోపాటు మరో ముగ్గురు అగ్రకులాలకు చెందిన మంత్రులున్నారు. అంటే.. మొత్తం 11 మందిలో ఆరుగురు అగ్రకులాల వారే ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు దళితులు (మాల, మాదిగలు ఒక్కొక్కరు చొప్పున), ఒకరు బీసీ, మరొకరు బీసీ మహిళ, ఇంకొకరు ఎస్టీ మహిళ (ఆదివాసీ) ఉన్నారు.

ఎస్టీల్లో లంబాడా, బీసీల్లో యాదవ, ముదిరాజ్‌, మున్నూరుకాపు వంటి కొన్ని బలమైన సామాజిక వర్గాలకు, మైనారిటీలకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. పైగా నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్థానం దక్కని వర్గాలు, జిల్లాలకు విస్తరణలో చోటు కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే.. ఆశావహుల్లో మాత్రం ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్న వర్గాల వారే ఉండడం పెద్ద సమస్యగా మారింది. కానీ, మంత్రి పదవి కోసం ఏడాదికి పైగా ఎదురుచూస్తున్నవారు పార్టీ నాయకత్వం తీరుతో విసిగిపోతున్నారు.

రేసులో ముందంజలో..

అసెంబ్లీలో కాంగ్రెస్‌కున్న సంఖ్యా బలాన్ని బట్టి నాలుగు ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు సీట్లలో ఒక సీటు అగ్రకులానికి, ఒకటి ఎంబీసీలకు (అత్యంత వెనుకబడిన వర్గం), ఎస్సీ మాదిగ, ఎస్సీ మాలకు చెరో సీటు కేటాయించనున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎస్సీ మాదిగ నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపతకుమార్‌ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. ఆయనతోపాటు పార్టీ నేతలు దొమ్మాటి సాంబయ్య, రాచమళ్ల సిద్ధేశ్వర్‌ రేసులో ఉన్నారు.

ఎస్సీ మాల నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. ఓసీల్లో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ్‌కుమార్‌, ఎమ్మెల్సీ జీవనరెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌ రేసులో మిగిలారు. ఎంబీసీల నుంచి సీనియర్‌ నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఒక సీటు కేటాయించాల్సి వస్తే మళ్లీ సమీకరణలు మారతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ప్రస్తుతం మంత్రి వర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ముదిరాజ్‌ సామాజిక వర్గ నేతను మంత్రిని చేస్తామంటూ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంతరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. పార్టీలో ఆ సామాజిక వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దాదాపు ఖరారైంది. అలాగే ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి సుదర్శనరెడ్డికి మంత్రి పదవి కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టుపడుతున్నారు.

అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహనరెడ్డి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం.. సోషల్‌ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి ఒక సీటే కేటాయిస్తే.. ఈ ముగ్గురి ఆశలూ గల్లంతైనట్లేనంటున్నారు. పరిగి రామ్మోహనరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చీఫ్‌విప్‌ పదవి దక్కనున్నట్లు చెబుతున్నారు.

ఇక.. వర్గీకరణ అంశం తెరపైకి వచ్చాక ఎస్సీ మాదిగ, మాల వర్గాల మధ్య పోటీ మరింత తీవ్రమైంది. మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్‌ పోటీ పడుతుండగా.. మాదిగ సామాజిక వర్గం నేతలూ క్యాబినెట్లో బెర్తు కోసం పట్టు పడుతున్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి వివేక్‌తో పాటు ప్రేమ్‌సాగర్‌రావు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక ముదిరాజ్‌ సామాజికవర్గంతో పాటు మరో బీసీ సామాజిక వర్గానికీ విస్తరణలో చోటు కల్పించాలంటూ బీసీ వర్గాల నేతలు ఒత్తిడి తెస్తున్నారు.

ఎస్టీ లంబాడా వర్గం నుంచి బాలూనాయక్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించాలా.. లేక డిప్యూటీ స్పీకర్‌గా నియమించాలా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపున ముస్లింల నుంచి పార్టీ సీనియర్‌ నాయకులు ఎవరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేరు. ఎమ్మెల్సీ అమెరలీఖానకు మంత్రి పదవి ఇచ్చేంత సీనియారిటీ లేదు. క్యాబినెట్‌ ర్యాంకుతో షబ్బీర్‌ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమించిన నేపథ్యంలో ఈ వర్గానికి మంత్రి వర్గంలో చోటు కల్పించాలా.. వద్దా అనే చర్చా నడుస్తోంది. ఏదేమైనా నెలాఖరుకల్లా ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Recent Comments
Leave a Comment

Related News