ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత పాలనను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒక్కొక్కటీ అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మరో హామీపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం హామీ అమలు చేస్తామని ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో చంద్రబాబు ప్రకటించారు. అదే రోజు ఆటో డ్రైవర్ల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని ప్రకటించారు.
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి ఎలా ఉంటుందో ఏడాది కాలంలోనే చేసి చూపించామని అన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ పనులు చేశామని, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా ముందుకు పోతున్నామని తెలిపారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన అనుభవంతో సుపరిపాలన అందించానని గుర్తుచేశారు.
జగన్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతిందని ఆరోపించారు. మూడు రాజధానులంటూ జగన్ ఆడిన మూడు ముక్కలాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని ఆవేదన చెందారు. జగన్ వల్ల ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని నీతి ఆయోగ్ కూడా చెప్పిందని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణ పనులను తిరిగి పట్టాలెక్కించామని, మూడేళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రధాని మోదీని ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామని అన్నారు. పీ-4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్‌షిప్) కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని ఎన్నారైలకు, పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.