రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జ‌గ‌న్ వ‌స్తాడా?

admin
Published by Admin — February 23, 2025 in Politics, Andhra
News Image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. తొలి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మరుసటి రోజుకు సభ వాయిదా పడుతోంది. ఆ తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి? ఏ అంశంపై ఏ రోజు చర్చించాలి? అన్న అంశాల‌పై అజెండాను ఖరారు చేస్తారు.

ఇకపోతే ఈసారి జర‌గ‌బోయే అసెంబ్లీ సమావేశాలు ఏపీ రాజకీయాలను హీటెక్కించ‌బోతున్నాయి. గ‌త‌ ఏడాది జరిగిన ఎన్నికల్లో 11 సీట్లనే గెలుచుకున్న వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ అసెంబ్లీకి రావ‌డం మానేశారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ పై తీవ్ర వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. సామాన్య ప్ర‌జ‌లు సైతం జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. మ‌రోవైపు అధికార పార్టీ నేతలు ఈసారి అసెంబ్లీ సామావేశాల‌కు రాకుంటే జ‌గ‌న్ పై వేటు ప‌డ‌టం ఖాయ‌మంటూ హెచ్చరిస్తున్నారు.

ఇటువంటి ప‌రిణామాల న‌డుమ జ‌గ‌న్ ఈసారి అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కావాల‌ని.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళం వినిపించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని వైసీపీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా, ఈ సారి అసెంబ్లీ సమావేశాలు రెండు లేదా మూడు వారాల పాటు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. 24వ తేదీ గవర్నర్ ప్రసంగం, 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. 26న మహాశివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండ‌టంతో రెండు రోజులు సెలవులు ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఫిబ్రవరి 28వ తేదీన ఏపీ ప్ర‌భుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాగా, సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనలను అధికారులు చాలా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.

Recent Comments
Leave a Comment

Related News