దక్షిణాది మరియు ఉత్తరాది సినీ ప్రేక్షకులకు జ్యోతికను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఆమె.. తెలుగు, మలయాళ భాషల్లో కూడా పలు హిట్ చిత్రాలతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పర్సనల్ లైఫ్‌లో సూర్య భార్యగా, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఒక సక్సెస్ ఫుల్ నటిగా సత్తా చాటుతున్న జ్యోతిక.. అప్పుడప్పుడూ పరిశ్రమలోని అసమానతలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటుంది. అయితే తాజాగా సౌత్ హీరోలపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా జ్యోతిక దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు దక్కుతున్న స్థానం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి సినిమా పోస్టర్స్ లో హీరోయిన్లు కనిపించరు, కేవలం హీరోలే ప్రధానంగా కనిపిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ హీరోయిన్లు ఉన్నా ఆ పోస్టర్లను హీరోలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేయడానికి మాత్రం ఒప్పుకోరంటూ సౌత్ యాక్టర్స్ కు జ్యోతిక ఘాటుగా చురకలు వేసింది.
ఈ సందర్భంగా హిందీ, మలయాళ ఇండస్ట్రీస్‌లో తనకు లభించిన గౌరవాన్ని జ్యోతిక గుర్తు చేసుకుంది. బాలీవుడ్‌లో `సైతాన్` సినిమా సమయంలో అజయ్ దేవగన్ తన పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారని, అలాగే మలయాళంలో `కాథల్-ది కోర్` మూవీకి సంబంధించిన తన పోస్టర్‌ను కూడా మమ్ముట్టి స్వయంగా ప్రమోట్ చేశానని జ్యోతిక ఉదాహరణలు ఇచ్చారు. కానీ, సౌత్‌లో పరిస్థితి ఇందుకు పూర్తిగా వేరుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి తాను వర్క్ చేశానని.. కానీ ఒక్కరు కూడా హీరోయిన్ ఫొటో ఉన్న పోస్టర్‌ను తమ సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఆసక్తి చూపలేదని జ్యోతిక తేల్చి చెప్పారు. ప్రస్తుతం జ్యోతిక కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జ్యోతిక వ్యాఖ్యలతో మరోసారి ఇండస్ట్రీలో హీరోయిన్ల ప్రాధాన్యం, వారి గుర్తింపు గురించి చర్చ ప్రారంభమైంది.