ఎమ్మెల్సీ కవితపై బీఆర్ ఎస్ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తన ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి ఆ లేఖను స్పీకర్ కు పంపించారు. సస్పెన్షన్ అనంతరం తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డానని, తెలంగాణ ఆత్మగా తెలంగాణ జాగృతి పనిచేసిందని అన్నారు. బీఆర్ఎస్ కోసం తానేమీ చేయలేదా అని ప్రశ్నించారు.తనను సస్పెండ్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ కవిత కంటతడి పెట్టారు.
20 ఏళ్లుగా కేసీఆర్ కోసం, తెలంగాణ ప్రజల కోసం, పార్టీ కోసం కష్టపడ్డానని అన్నారు. సడన్ గా తనను సస్పెండ్ చేస్తూ పార్టీకి నీకు సంబంధం లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కు నష్టం చేసిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని తాను అన్న వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. బీఆర్ ఎస్ పార్టీ తనదేనని, వేరే పార్టీకి ఓటేయమని తాను తన జీవితంలో ఎవరికీ చెప్పలేదని అన్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.