కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిలో హరీష్ రావు పాత్ర ఉందంటూ కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడిన కవిత మరోసారి హరీష్ రావు పై, సంతోష్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ ఇద్దరు నేతలు పార్టీని జలగల్లా పట్టిపీడిస్తున్నారని కవిత ఆరోపించారు. తమ కుటుంబాన్ని, పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీల నేతలకు హరీష్ రావు 60 లక్షల డబ్బులు ఇచ్చారని షాకింగ్ ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయ్యారని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి హరీష్ రావును రేవంత్ రెడ్డి ప్రశ్నించడం లేదని ఆరోపించారు. సంతోష్ బాధితులు చాలా మంది తనకు ఫోన్ చేస్తున్నారని, వారి బాధలను చెప్పుకుంటున్నారని అన్నారు. ప్రాణం పోయినా కేసీఆర్, కేటీఆర్ లకు అన్యాయం జరగనివ్వమని చెప్పారు.
తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. ఆరడుగుల బుల్లెట్ హరీష్ రావు తనను గాయపరిచారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ నుంచి కూడా కుట్రలు చేస్తారని అన్నారు. వారి వల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల వంటి నేతలు పార్టీ వీడి వేరే పార్టీలో చేరారని అన్నారు. ఈ విషయాలను రామన్న(కేటీఆర్) గమనించాలని, కేసీఆర్ కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పార్టీలో వారి చుట్టూ ఏం జరుగుతుందో పరిశీలించుకోవాలని హెచ్చరించారు.