2024 ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ క్లిష్టమవుతోంది. అధికారాన్ని కోల్పోయిన జగన్.. ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీలో అడుగుపెట్టనని మొండిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రాని ఆ హోదా కోసం కోర్టుకు వెళ్లారు. పైగా దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి.. మీపై పోరాటం చేస్తామంటూ అధికార పార్టీనే వేడుకుంటున్నారు. జగన్ వైఖరి పట్ల ప్రజలే కాదు సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ నెలలో వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియమాల ప్రకారం, ఒక ఎమ్మెల్యే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా 60 పని దినాలు వరుసగా అసెంబ్లీకి హాజరుకాకపోతే స్పీకర్ అనర్హత వేటు వేయవచ్చు. అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన రోజు తర్వాత ఇప్పటి వరకు వైసీపీ సభ్యులు సమావేశాలకు రాకపోవడంతో ఈ గడువు సెప్టెంబర్ నెలలో పూర్తవబోతోంది. ఈ పరిస్థితి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా, సెప్టెంబర్‌లో జరగబోయే వర్షాకాల సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారట. తద్వారా అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా కనీసం సభలో నిలబడి ప్రజల కోసం మాట్లాడొచ్చు. తమ నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించే ఛాన్స్ కూడా దొరుకుతుంది. అనర్హత వేటు భయం, రాజకీయ భవిష్యత్తును కోల్పోవద్దనే ఉద్దేశంతోనే వారు జగన్ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్లేందుకు డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరు అన్నది బహిర్గతం కాలేదు. వారిలో మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారని అంటున్నారు. ఏదేమైనా జగన్ ఆదేశాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు సభకు హాజరవుతే, అది పార్టీ లోపలి విభేదాలను బహిర్గతం చేస్తుంది. ఇదే జరిగితే జగన్ ప్రతిష్టకు పెద్ద దెబ్బ తగలడం ఖాయం. ప్రతిపక్షంగా ఉన్నా, పార్టీ నియంత్రణ తన చేతుల్లోనే ఉందని చెప్పుకుంటున్న జగన్ స్థానం బలహీనమవుతుంది.