ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఈ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీ అమలు కానుంది. ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమాను ఈ పాలసీ అందించనుంది. 2493 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా 3257 వైద్య సేవలు ప్రతి కుటుంబం పొందేలా ఈ పాలసీని రూపొందించారు.
రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలాగా ఈ పాలసీ అమలు కానుంది. గతంలో మాదిరిగా ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్సల అనుమతుల కోసం ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు లభించనున్నాయి. ఇందుకోసం, ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రూ.2.5 లక్షల రూపాయలలోపు వైద్య చికిత్సల క్లెయిమ్ ను ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి, రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుంది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో నూతనంగా 10 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.