అభిమానుల అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానం ఆరాధనగా మారటం మామూలే. అదే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు పెద్ద గుదిబండగా మారింది. గడిచిన కొద్ది రోజులుగా ఆయనపై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. దీనికి కారణం తెలుగు తమ్ముళ్లే కావటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రంగం ఏదైనా.. తాము అభిమానించే అధినేతకు వారి అభిమానులు రక్షకులుగా మారుతుంటారు. వారి మీద ఈగ వాలనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా తాము అభిమానించే అధినేతలపై విమర్శలు చేస్తే.. తమనే వ్యక్తిగతంగా అన్నట్లుగా ఫీల్ అయి విరుచుకుపడటం చూస్తేనే ఉంటాం.
ఇందుకు భిన్నంగా చంద్రబాబు పరిస్థితి ఉందంటున్నారు. జగన్ ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న కష్టాలు.. నష్టాలు.. కేసులకు సంబంధించిన ప్రతి చర్య వేగంగా ఉంటాయని అంచనా ఉండటం.. అదేమీ లేకపోవటంతో చంద్రబాబు తీరును సోషల్ మీడియా వేదికగా చేసుకొని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఆయన చర్యల్ని తప్పు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరే రాజకీయ పార్టీ అధినేతకు ఇలాంటి పరిస్థితి లేదని చెప్పాలి.
బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ జనసేన కానీ.. ఇలా ఏ పార్టీకి లేని విధంగా తెలుగు తమ్ముళ్లు మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైఖరిని మొహమాటం లేకుండా విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక పెద్ద ఉదాహరణ ఇటీవల చోటు చేసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ జీవీ రెడ్డిని పదవి నుంచి తప్పుకోవాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని అరవీర భయంకర చంద్రబాబు అభిమానులు సైతం తప్పు పట్టటం షాకింగ్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా చేసుకొని జీవీ రెడ్డిని ఎలా తప్పిస్తారంటూ సూటిగా ప్రశ్నించటం కనిపించింది.
రాజీనామా నేపథ్యంలో తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు సైతం జీవీ రెడ్డికి వచ్చిన సానుభూతికి అచ్చెరువు పొందిన పరిస్థితి. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అధినేతను నేరుగా విమర్శించే పరిస్థితి మరే రాజకీయ పార్టీలోనూ కనిపించదు. కానీ.. ఇటీవల కాలంలో చంద్రబాబు మీద ఈ తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీనికి కారణం.. ప్రభుత్వం కొలువు తీరిన తొమ్మిది నెలల కాలంలో తాము ఆశించిన చర్యలు ఏవీ జరగకపోవటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. గత ప్రభుత్వం చర్యలకు.. కూటమి సర్కారు ప్రతి చర్యలు ఉండాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. నిజానికి ఈ తీరు మంచిది కాదు.