భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నాయకత్వ పటిమను చంద్రబాబు కొనియాడారు. సరైన సమయంలో మన దేశానికి సరైన నాయకుడు ప్రధానిగా లభించడం దేశ ప్రజల అదృష్టమని చంద్రబాబు అన్నారు. దేశాన్ని దృఢ సంకల్పంతో ముందుకు నడిపిస్తున్న నాయకుడు మోదీ అని, 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' నినాదంతో ఎందరో జీవితాల్లో సానుకూల మార్పు వచ్చిందని చెప్పారు.
'వికసిత్ భారత్ @ 2047' లక్ష్యంతో దేశాన్నిఅగ్రగామిగా నిలపడానికి మోదీ చేస్తున్న కృషిని అభినందించారు. ప్రధాని సంపూర్ణ ఆరోగ్యంతో, అపారమైన శక్తితో మాతృభూమికి మరెన్నో ఏళ్లు సేవ చేయాలని ఆకాంక్షించారు. అదే సమయంలో దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ఒక భూస్వామి అని విమర్శించారు. నెహ్రూ అనుసరించిన సోషలిస్టు, ఫ్యూడల్ విధానాల వల్లే స్వాతంత్య్రానంతరం దేశాభివృద్ధిలో వెనుకబడిపోయామని అన్నారు. ఆయన విధానాల వల్లే సింగపూర్ వంటి దేశాలతో భారత్ పోటీ పడలేకపోయిందని ఆరోపించారు.
భారత్, సింగపూర్ లకు కొన్నేళ్ల తేడాలోనే స్వాతంత్య్రం వచ్చిందని, సింగపూర్ నేత లీ కాన్ యూ పోటీతత్వ ఆర్థిక విధానాలను అమలు చేశారని గుర్తు చేశారు. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో నెహ్రూ చదువుకున్నారని, ఆయన ఏ గేటు దగ్గరికి వెళ్తే ఆ గేటు దగ్గరికే కారు వచ్చేదని గుర్తు చేశారు. అటువంటి నేపథ్యం ఉన్న నెహ్రూ అనుసరించిన సోషలిస్టు విధానాల వల్ల 1947 నుంచి 1991 వరకు దేశం స్తంభించిపోయిందన్నారు. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణల తర్వాతే భారతదేశం మళ్లీ అభివృద్ధి బాట పట్టిందని అన్నారు.