ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండు రోజులపాటు జరిగాయి. అయితే, ఈ రెండు రోజుల్లో అందరి దృష్టి వైసిపి మీద... వైసిపి ఎమ్మెల్యేల మీద.. ఆ పార్టీ అధినేత జగన్ మీద ఉన్న విషయం తెలిసిందే. జగన్ అసెంబ్లీకి రావడం లేదని, జగన్ మైకు కోసం మంకు పట్టు పడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలతో పాటు కొందరు సమర్ధించే వాళ్ళు కొందరు వ్యతిరేకించే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అయితే, జగన్ విషయాన్ని, వైసిపి ఎమ్మెల్యేలు విషయాన్ని పక్కనపెడితే అసలు టిడిపి ఎమ్మెల్యేల విషయం ఇప్పుడు ఆసక్తిని రేపింది.
తాజాగా శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం చంద్రబాబు సభా నాయకుడి హోదాలో టిడిపి తరఫున ఎంత మంది ఎమ్మెల్యేలు ఈ రెండు రోజుల పాటు సభకు హాజరయ్యారు? ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఏ ఏ అంశాలను ప్రస్తావించారు? వాటికి మంత్రులు ఇచ్చిన సమాధానాలు ఏమిటి? అనే విషయాలపై ఆరా తీశారు? దీనికి కూడా కారణం ఉంది. శుక్రవారం నాటి సభలో టిడిపి సభ్యుడు బొండ ఉమామహేశ్వరరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అసలు టిడిపి ఎమ్మెల్యేలు ఏ ఏ ప్రశ్నలు అడుగుతున్నారు? ఎంతమంది వస్తున్నారు? అనే విషయాలను అప్పటికప్పుడు ఆరా తీశారు. వెంటనే దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సీఎంకు అందజేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో 134 మంది సభ్యులు ఉన్న టిడిపికి కేవలం 72 మంది సభ్యులు మాత్రమే వరుస రెండు రోజులు హాజరయ్యారని స్పష్టమైంది. మరో 20 మంది సభకు వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయారని, ఎటువంటి ప్రశ్నలు అడగలేదని నివేదికలో స్పష్టమైంది.
మరో 12 మంది అసలు సభకే రాకుండా దూరంగా ఉన్నట్టు చంద్రబాబుకు తెలిసింది. అంటే ఒక రకంగా ఇప్పటివరకు వైసీపీ సభ్యులపై సభకు రావడంలేదని, సభకు డుమ్మా కొడుతున్నారని చేస్తున్న విమర్శలు ఎలా ఉన్నప్పటికీ సొంత పార్టీ నాయకులు సభకు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుండడం సభకు, అసలు రాకుండా కూడా వ్యవహరించడం వంటివి చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరిగే సభలకు 100% టిడిపి నాయకులు హాజరు కావాల్సిందేనని ఆయన షరతు విధించారు.
మరి ఇది ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుంది? ఎంతమంది వస్తారు అనేది చూడాలి. ఇక ప్రశ్నల విషయానికి వస్తే కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. బలమైన ప్రజా సమస్యలకు సంబంధించిన ప్రశ్నలను అడగకుండా తేలికపాటి ప్రశ్నలు అడుగుతున్న విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. వచ్చే సమావేశాల్లో కచ్చితంగా బలమైన ప్రశ్నలను సంధించాలని సూచించారు. ముఖ్యంగా గత ప్రభుత్వ వైఫల్యాలను సభా వేదికగా ఎండగట్టాలని సభ్యులకు సూచించినట్టు సమాచారం. సో.. దీనిని బట్టి ఎమ్మెల్యేలు ఇక, తప్పించుకోలేరని తెలుస్తోంది.