రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అయితే, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాకపోవడం విశేషం. పైగా ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనం కూడా ఏమీ లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఈనెల 22 నుంచి దేశం వ్యాప్తంగా వస్తు సేవల పన్ను.. జిఎస్టి స్లాబులు మారుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు రకాలుగా ఉన్న స్లాబులు ఇకనుంచి రెండు స్లాబులకు తగ్గనున్నాయి. దీంతో నిత్యవసరాల నుంచి దుస్తులు, గృహపకరణాలు వంటి కీలక సామగ్రి వరకు కూడా ధరలు కొంతమేరకు దిగివచ్చే అవకాశం ఉంది.
అయితే వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఇంకో మాటలో చెప్పాలంటే ఇలా పన్నుల స్లాబులు మార్చడం వల్ల రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయం భారీగా తగ్గుతుంది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఏమి భర్తీ చేస్తానని ఇప్పటివరకు హామీ ఇవ్వలేదు. ఉదాహరణకు 100 రూపాయలు వచ్చే పన్నుల స్థానంలో ఇకనుంచి రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన, అదే విధంగా వస్తువుల వినియోగం ప్రాతిపదికన కూడా పన్నుల రాబడి తగ్గిపోతుంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి కీలక రాష్ట్రాలకు ఈ జిఎస్టి పన్ను తగ్గింపు ప్రభావం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది.
ఏపీపై అయితే మరింత ఎక్కువగా ఉండనుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు భారీ ఆదాయాన్ని సమకూర్చే కీలక నగరాలు ఉన్నాయి. ఏపీ విషయానికి వస్తే ఆ తరహా నగరం ఇక్కడ లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సహజంగానే ఆదాయం తగ్గే అవకాశం కనిపిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనేది ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం మనసులో మాటను బయటపెట్టేసారు. జిఎస్టి పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణలు మంచివేనని చెప్పారు.
అయితే.. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుందని కూడా చెప్పారు. సరే ఈ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు స్లాబులు మార్పు సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25 నుంచి భారీ ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. గ్రామ గ్రామాన అదే విధంగా నగరాలు పట్టణాల్లో కూడా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు భారీ ఎత్తున ప్రదర్శనలు, కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. దీనికి అందరూ సహకరించాలని కూడా సీఎం చంద్రబాబు సభ వేదికగా చెప్పుకొచ్చారు.
అంటే వారు ఓరకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జీఎస్టీ విషయాన్ని రాష్ట్రంలో ప్రచారం చేయడం కిందకే వస్తుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు గాని ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ లో ఇప్పుడు స్లాబులు తగ్గించడం వెనుక అనేక రాజకీయ కోణాలు ఉన్నాయన్నది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. మోడీ ప్రభావం తగ్గుతుండడం, తమిళనాడు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జిఎస్టి తగ్గింపును ప్రకటించారు.
దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయటం, రాష్ట్ర ఖజానా నుంచి ఈ ప్రచారానికి సొమ్ములు వెచ్చించటం వంటివి సరికాదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. అయినప్పటికీ కేంద్రంలో తాము మద్దతిస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం తీసుకుని నిర్ణయం తమదే అని చెబుతున్న కూటమి నాయకులు దీనిని ప్రచారం చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మరి దీని విషయంలో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.