అది జ‌రిగుంటే పాలిటిక్స్‌లోకి వచ్చే వాడ్నే కాదు: ప‌వ‌న్‌

admin
Published by Admin — September 22, 2025 in Politics, Movies
News Image

తెలుగు రాష్ట్రాల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ హీరోగా సాధించిన ఇమేజ్‌నే ఆధారంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌.. జ‌న‌సేన పార్టీని స్థాపించారు. ఎన్ని ఒడిదుడుగులు, మ‌రెన్ని అవ‌మానాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ఏపీ రాజ‌కీయాల్లో తిరుగులేని శ‌క్తిగా ఎదిగారు. 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ కూటమితో కలిసి పోటీ చేసి త‌న స‌త్తా ఏంటో నిరూపించుకున్నారు. ప్ర‌స్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూ ప్ర‌జా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు.. ఈ రెండింటినీ సమాంతరంగా నడిపించడం అంత తేలికైన విషయం కాదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ సమతుల్యతను క్రమంగా సాధించుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ బిగ్ స్టేట్‌మెంట్ ను పాస్ చేశారు. ఆదివారం `ఓజీ` మ్యూజిక్ కాన్సర్ట్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జ‌రిగింది. ఈవెంట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వ‌ర‌కు వ‌ర్షం కుమ్మ‌రించినా ఫ్యాన్స్ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు.

ఈ కాన్సర్ట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `ఓజీ విష‌యంలో ఎక్కువ క్రెడిట్ సుజిత్ కే ద‌క్కుతుంది. సుజిత్ విజ‌న్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్. వీళ్లిద్దరూ ఒక ట్రాన్స్‌లో ఉన్నారు. అందులోకి నన్నూ లాగారు. నేనొక డిప్యూటీ సీఎం అన్న సంగతే మర్చిపోయేలా చేశారు. నాకు సుజీత్‌ జపనీస్ కూడా నేర్పించాడు. సుజీత్ లాంటి యువ దర్శక బృందం జానీ మూవీ చేసినప్పుడు ఉండుంటే రాజకీయాల్లో వచ్చే వాడ్నే కాదు` అంటూ ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

ఇంకా మాట్లాడుతూ.. `ఒక కత్తి చుట్టూ కథను అల్లి ప్రేక్ష‌కులన రంజింపచేసేలా సినిమా తీశారు. నాకు, ప్రియాంకకు మధ్య నడిచే ప్రేమకథ చిన్నదే అయినా తెర‌పై చాలా అందంగా ఉంటుంది. శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మి అద్భుతంగా న‌టించారు. శ్రియా రెడ్డి ఒక ఆడ శివంగి. భ‌విష్య‌త్తులో శ్రియారెడ్డితో మళ్లీ కలిసి నటిస్తా` అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న కామెంట్స్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి.

Tags
Pawan Kalyan OG Power Star Pawan Kalyan They Call Him OG OG Music Concert
Recent Comments
Leave a Comment

Related News