అమెరికాలోని లేక్ లానియర్ ఐలాండ్స్ లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల VRSEC 1996 -2000 బ్యాచ్ రజతోత్సవ సమ్మేళనం సెప్టెంబర్ 19 - 21 వరకు ఘనంగా జరిగింది. అమెరికా నలుమూలల నుంచే కాకుండా, వివిధ దేశాల నుంచి దాదాపు 70 మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ వేడుకను చూస్తుంటే, అదొక ఈవెంట్ లా కాకుండా, తిరిగి కాలేజీ రోజుల్లోకి వెళ్లినట్లు, ఒక పండుగ లాగా అనిపించింది
మూడు రోజుల ఈ reunion లో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలు:
• శుక్రవారం, సెప్టెంబర్ 19: "ది గేమ్ ఛేంజర్" వద్ద కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆ తర్వాత లేక్ హౌస్‌లలో అర్ధరాత్రి దాటిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ పాత జ్ఞాపకాల్లో మునిగిపోయారు. వచ్చిన క్లాస్ మేట్స్ అందరికి, 12 లేక్ హౌస్ లలో బస ఏర్పాటు చేశారు. ఆడవారికి, మగవారికి వేరు వేరు గా వసతి కల్పించారు. ఒక్కొక్క లేక్ హౌస్ కు ఒక్కొక్క గోల్ఫ్ కార్ట్ ఏర్పాటు చేశారు.
• శనివారం, సెప్టెంబర్ 20: వచ్చిన అతిధులు ఉదయం గోల్ఫ్ కార్ట్‌లలో ఐలాండ్ మొత్తం తిరుగుతూ, పికిల్‌బాల్ ఆడుతూ, హైకింగ్ చేస్తూ సరదాగా గడిపారు. లైవ్ దోశ స్టాల్‌తో బ్రంచ్ ఆస్వాదించారు. ఆ తర్వాత అందరూ ఒకేలాంటి టీ-షర్టులు వేసుకుని గ్రూప్ ఫోటో దిగారు.
సాయంత్రం గ్రాండ్ బాల్‌రూమ్‌లో జరిగిన సంబరాలు ఈ వేడుకకే హైలైట్ గా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో ఈవెంట్ ప్రారంభమైంది. పద్మజ భరతనాట్యం, నీరజ జొన్నలగడ్డ కథక్ నృత్యాలతో స్టేజ్ పై అదరగొట్టారు. లేడీస్ గ్రూప్ చేసిన తెలుగు మెడ్లీ డ్యాన్స్, 'సమరసింహా రెడ్డి' మూవీ ట్రైలర్ స్కిట్, శ్రీకాంత్ తుమ్మూ చేసిన "బోటనీ పాఠముంది" డాన్స్ వంటి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా, దివంగతులయిన బ్యాచ్ మేట్స్ సునీల్ అడ్డల, ప్రశాంతి, మరియు అరవింద్ చిల్లరపు లకు నివాళులు అర్పించారు. కొంతసేపు మౌనం పాటించి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ రీయూనియన్ కి హాజరు కాలేని వాళ్ళు కూడా తమ వీడియో సందేశాలను పంపి ఈ వేడుకలో పరోక్షంగా పాలుపంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి వీఆర్ఎస్ఈసీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పరుచూరి వెంకటేశ్వర రావు జూమ్ కాల్ లో వచ్చి, బ్యాచ్‌ను అభినందించారు. అదే విధంగా వీఆర్ఎస్ ఈసీ డీమ్డ్ యూనివర్సిటీ గా అయ్యిందని, అయినప్పటికీ స్టూడెంట్స్ సంఖ్య పెంచకుండా, వారి నాణ్యత, నైపుణ్యం మీద దృష్టి సారిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కాలేజీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో కాలేజీకి తమ వంతుగా ఏ విధంగా సాయం చేయగలమని చర్చించుకున్నారు.
ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం ఇండియా నుంచి వచ్చిన శ్రీధర్ పాలడుగు, చక్రవర్తి చుక్కపల్లి, అనితీ వర్మ, జానకిరామ్(యూకే), సుమ బొడ్డు(కెనడా)లు రీయూనియన్ కేక్ కట్ చేశారు.చివరగా, డిజె మ్యూజిక్‌తో డాన్స్ ఫ్లోర్ సందడిగా మారింది. 90ల నాటి హిట్ సాంగ్స్‌కు అందకే ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.
• ఆదివారం, సెప్టెంబర్ 21: వీడ్కోలు బ్రేక్‌ఫాస్ట్‌తో ఈ వేడుక ముగిసింది. మళ్ళీ కలుసుకునే వాగ్దానంతో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని, మధురమైన జ్ఞాపకాలతో తమ ప్రయాణాలను మొదలుపెట్టారు.
"25 ఏళ్లు గడిచిందంటే నమ్మలేకపోతున్నాం. రాంప్ వాక్, ఒకరి గురించి ఒకరు పరిచయం చేసుకోవడం, నవ్వుకోవడం.. ఇవన్నీ కాలేజీ రోజులను గుర్తు చేశాయి. ఈ రీ యూనియన్ కేవలం కలుసుకోవడం మాత్రమే కాదు, మా అందరి బంధాన్ని, కాలేజీతో ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పింది," అని పూర్వ విద్యార్థులు అన్నారు.
వీఆర్ఎస్ ఈసీ బంధం ఎంత బలమైందో ఈ ఈవెంట్ నిరూపించింది. ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి అలుపెరగని కృషి చేసిన నిర్వాహక కమిటీ సభ్యులు: శ్రీహరి అట్లూరి, ఆశాలత వేముగంటి, ఉప్పెన్ చావా, అనిల్ యార్లగడ్డ, ఫణీంద్ర కడియాల, శ్రీనివాస్ చల్లగుండ్ల, సుధాకర్ రెడ్డి ఆళ్ల, పద్మజ కర్రి, గూడవల్లి రాజేష్, అనుజ రామ, గోపి మన్నె, సునీల్ తొట్టెంపూడి.