ఆటోడ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు మొదలు అన్ని విషయాలపై ఆటో డ్రైవర్లు చర్చిస్తుంటారని లోకేశ్ అన్నారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఆటో డ్రైవర్లు నవ్వుతూ పలుకరిస్తారని ప్రశంసించారు. యువగళం పాదయాత్ర సమయంలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నానని చెప్పారు జగన్ హయాంలో కుడి చేతిలో 10 వేలు పెట్టి.. ఎడమ చేత్తో రూ.20 వేలు తీసుకున్నారని, గ్రీన్ ట్యాక్స్ పెంచి తమపై భారం మోపారని ఆటో డ్రైవర్లు తన దగ్గర వాపోయారని గుర్తు చేసుకున్నారు.
గత ప్రభుత్వం హయాంలో మహిళను కించపరిచిన రోజాకు చీరా, జాకెట్ ఇచ్చేందుకు తెలుగు మహిళలు వెళితే ఆటో డ్రైవర్లను రోజా ఇబ్బందులు పెట్టారని గుర్తు చేసుకున్నారు. ఆ ఆటో డ్రైవర్ కు చంద్రబాబు కొత్త ఆటో కొనిచ్చారని లోకేశ్ అన్నారు. ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉందని, డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఆటో వెనుక డ్రైవర్లు రాసే కొన్ని కొటేషన్లు తనను ఆకట్టుకున్నాయని లోకేశ్ అన్నారు. అంతేకాకుండా, వాటిని చదివి వినిపించారు.
మొక్కలు నాటితే...వర్షం పడుతుందని...పర్యావరణం, పచ్చదనం గురించి ఒక ఆటో డ్రైవర్ రాసిన కొటేషన్ అతడికి ఉన్న సామాజిక బాధ్యతను తెలియజేస్తోందని చెప్పారు. అందరూ బాగుండాలి...అందులో నేనుండాలి....జర భద్రం భయ్యా...మనందరం చల్లగా ఇంటి కెళ్లాలి... అంటూ ర్యాష్ వడ్రైవింగ్ వద్దని చెప్పిన ఆటో డ్రైవర్ కొటేషన్ బాగుందని కితాబిచ్చారు. అప్పుచేసి కొన్నా...నన్ను చూసి ఏడ్వకు....హాయ్ అని ఆశ పెంచొద్దు...బాయ్ అని బాధ పెట్టొద్దు..అంటూ ఫన్నీ కొటేషన్లు కూడా రాస్తుంటారని సరదాగా వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్ల మనసు పెద్దదని..ఆటోలో బ్యాగ్, పర్సు, డబ్బులు, ఫోన్లు, విలువైన వస్తువులను ప్రయాణికులు వదిలేస్తో వారిని వెతికి తిరిగి అప్పగిస్తారని, లేదంటే పోలీసులకు అప్పజెబుతారని కితాబిచ్చారు.