ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఓ వైపు చంద్రబాబు..మరోవైపు మంత్రి లోకేశ్ కాళ్లకు బలపం కట్టుకొని దేశవిదేశాలు తిరుగుతున్నారు. అయితే, అవేమీ పట్టనట్లుగా కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఇష్టారీతిన మాట్లాడుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. టీటీడీ సభ్యుడు, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తాజాగా ఆ కోవలో చేరారు.
భగవద్గీత ప్రజల జీవితాలను మార్చలేదని రాజు ఓ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎస్ రాజుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఎంఎస్ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అప్పుడే మరొకరు అటువంటి కామెంట్లు చేసేందుకు సాహసించరని అన్నారు. మొన్న కొలికపూడి శ్రీనివాసరావు...ఇప్పుడు ఎంఎస్ రాజు...ఇలా చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు చిక్కులు తెచ్చిపెడుతున్నారు.