సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీగా, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ లండన్ లో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందించనుంది. దాంతోపాటు, హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. ఆ అవార్డును కూడా నారా భువనేశ్వరి అదే వేదికపై అందుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ అవార్డును అందుకునేందుకు లండన్ వెళుతున్న భువనేశ్వరితోపాటు సీఎం చంద్రబాబు కూడా లండన్ లో వ్యక్తిగతంగా పర్యటించనున్నారు.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నారా భువనేశ్వరిని డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక అంశాల్లో కీలకంగా పని చేసినందుకు గానూ ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఆమెకు దక్కింది. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సామాజిక సాధికారితకు పాటుపడుతున్న వ్యక్తిగా ఆమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపిచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్ పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహ్మద్, హీరో ఎంటర్ ప్రైజెస్, గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా వంటి దిగ్గజాలు ఈ అవార్డును గతంలో అందుకున్నారు. వారి సరసన భువనేశ్వరి చేరారు.
ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సులో హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా ఆమె అందుకోనున్నారు. ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు జాతీయ స్థాయిలో ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఐఓడీ ఎంపిక చేసింది. లండన్ లో ఈ వ్యక్తిగత పర్యటన తర్వాత చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాకలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా కొందరు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు. లండన్ లో కొందరు ప్రవాసాంధ్రులతో కూడా చంద్రబాబు కలవబోతున్నారు.