ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో జోగి రమేష్ కు వ్యతిరేకంగా ఏ 1 జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఈ రోజు జోగి రమేష్ ను సిట్ అధికారుల బృందం అరెస్ట్ చేసింది.
ఈ రోజు తెల్లవారుఝామున ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు, సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా జోగి రమేష్, సిట్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కాసేపు హైడ్రామా అనంతరం జోగి రమేష్ ను విజయవాడ సిట్ ఆఫీసుకు తరలించారు. జోగి రమేష్ తో పాటు ఆయన పీఏ ఆరేపల్లి రామును కూడా పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేశారు. అరెస్టు తర్వాత జోగి రమేష్ తానే తప్పు చేయలేదని, తన భార్యాపిల్లల సాక్షిగా చెబుతున్నానని అన్నారు.