ఏపీని కుదిపేసిన నకిలీ లిక్కర్ కేసులో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను ఎక్సైజ్ పోలీసులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే. అనంతరం.. వారిని విజయవాడ లోని ఎక్సైజ్ కార్యాలయంలో విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో సూత్రధారి.. అద్దేపల్లి జనార్దన్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా జోగిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన నివాసంతోపాటు.. రాము నివాసం కార్యాలయాల్లోనూ సోదారులు నిర్వహిస్తున్నారు.
కుట్రపైనే ఆరా!
అద్దేపల్లి జనార్దన్‌రావు వీడియో సందేశంలోను, తర్వాత పోలీసుల విచారణలోనూ జోగి పేరు చెప్పిన విషయం తెలిసిందే. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారుచేశామన్నారు. అంతేకాదు.. తద్వారా ఎక్కువ మంది నకిలీమద్యం తాగి ప్రాణాలు కోల్పోతే.. ఆ నిందను కూటమి సర్కారుపై వేసి.రాజకీయంగా తాము పైచేయి సాధించాలన్న ఉద్దేశంతోనే జోగి రమేష్ తనను ప్రోత్సహించారని కూడా.. అద్దేపల్లి తన వీడియో సందేశంలో వివరించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా పోలీసులు కూడా అదే కోణంలో విచారణ చేస్తున్నట్టు తెలిసింది. కుట్ర రాజకీయాలు ఎక్కడ నుంచి ప్రారంభమయ్యాయని, ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ద్వారా ఏం చేయాలని అనుకు న్నారన్న కోణంలోనే విచారిస్తున్నారు. ఈ కుట్రలో ఇంకెవరి పాత్ర ఉందో ఆరా తీస్తున్నారు. ఇక, ఈ కేసు విచారణలో భాగంగా.. జోగి రమేష్ , రాము నివాసాలు.. కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. నకిలీ మద్యం వ్యాపారాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే హార్డ్ డిస్కులు, పలు పత్రాలను పోలీసులు తీసుకువెళ్లారని జోగి రమేష్ కుటుంబ సభ్యులు తెలిపారు.