తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ వివాదం మరోసారి వేడి చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలు, అందుకు తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన ఘాటు సమాధానం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య సీక్రెట్ డీలింగ్ ఉందని ఆరోపించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై సీబీఐ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 11లోగా వారిని అరెస్ట్ చేయించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన.. “కాళేశ్వరం కేసుపై విచారణ జరిపిస్తామని మేం హామీ ఇవ్వలేదు. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయండి.” అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా, “కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలపై చర్చకు సిద్ధమా?” అని రేవంత్‌ను ప్రశ్నించారు.
తమపై అనవసర ఆరోపణలు చేయడం మానేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపైనే దృష్టి పెట్టాలి. ప్రజలతో మోసం చేయకుండా ఆరు గ్యారంటీలను నిజాయితీగా అమలు చేయండని హితవు పలికారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా, రాజకీయ ఆరోపణలు వేడెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీలూ ఒకరినొకరు విమర్శించుకుంటూ, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.