ప్రపంచానికి పెద్దన్న అగ్రరాజ్య అధిపతి ట్రంప్ కు ఉండే అధికారాలు అన్ని ఇన్ని కావు. అసలే తిక్క మనిషిగా అభివర్ణించే ఆయనకు కోపం వస్తే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో ఏ మాత్రం అంచనా వేయలేని పరిస్థితి. అలాంటి పెద్దమనిషి న్యూయార్క్ మేయర్ ఎన్నికల రంగంలోకి స్వయంగా దిగి.. అంతా తానై అన్నట్లు వ్యవహరించిన తర్వాత కూడా ఎదురుదెబ్బ తప్పలేదు. న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి విజయం సాధించారు. ఇది ట్రంప్ కు తగిలిన భారీ ఎదురుదెబ్బగా చెప్పాలి.
ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. ఎన్నికల్లో తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధిస్తే.. తాను కనీస అవసరాలకు సరిపోయేంత స్థాయిలోనే నిధులు కేటాయిస్తానని హెచ్చరించినప్పటికి ఓటర్లు పెద్దగా పట్టించుకున్నది లేదు. భారతీయ - ఉగాండ మూలాలున్న జొహ్రాన్ మమ్ దానీ డెమొక్రాట్ల అభ్యర్థిగా బరిలోకి నిలిచారు. ఆయన ఓటమి కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. మేయర్ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ట్రంప్.. గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశారు. కానీ.. అవేమీ ఫలించలేదు.
కమ్యూనిస్టు భావజాలం కలిగిన మమ్ దానీ న్యూయార్క్ మేయర్ గా గెలిస్తే తాను సహకరించనని స్పష్టం చేసినప్పటికి ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. న్యూయార్క్ మేయర్ గా గెలుపొందిన జొహ్రాన్ మమ్ దానీకి కేవలం 34 ఏళ్లు. అత్యంత పిన్న వయసులో గెలుపొందిన తొలి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. న్యూయార్క్ మేయర్ గా గెలుపొందిన మమ్ దానీ భారతీయ సినీ దర్శకుడు మీరా నాయర్ కొడుకు. ఉగాండా జాతీయుడైన మహమూద్ మమ్ దానీ - మీరాకు జన్మించిన సంతానమే జొహ్రాన్.
సోషలిస్టు భావజాలం ఉన్న అతను న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై ఆయన విజయం సాధించారు. మమ్ దానీ విజయంలో ఉచితబస్సు పథకంతో పాటు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాల హామీలు కీలక భూమిక పోషించాయని చెబుతున్నారు. తాజా ఎన్నికల ఫలితం స్వదేశంలో ట్రంప్ కు తగిలిన పెద్ద ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు.