పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్న సీఎం చంద్రబాబు.. ఈ ఏడాదిలోనే 20 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పలు సందర్భాల్లోనూ ఈ విషయం చెప్పారు. ఇప్పటి వరకు గడిచిన 16 మాసాల్లో 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సాధించారు. అదేవిధంగా మరో 10 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు సాధిస్తే.. ఈ టార్గెట్‌ను రీచ్ కావొచ్చని ఆలోచన చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన విదేశీ పర్యటనలు చేశారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా పర్యటించి.. పెట్టు బడులు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం పెట్టుబడులకు విశాఖ వేదికగా మారనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సులో ఆయా పెట్టుబడులకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకోనున్నారు. అంటే.. విశాఖ పెట్టుబడుల సదస్సుకు సీఎం చంద్రబాబు భారీ ప్రాధాన్యం ఇస్తున్న విషయం స్పష్టమవుతోంది.
ఇటీవల లండన్‌కు వెళ్లిన సందర్భంలో కూడా.. ఆయన విశాఖలో జరుగుతున్న ఏర్పాట్లపై నాయకులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకున్నారు. ఘనంగా ఏర్పాట్లు చేయాలని.. ఎక్కడా ఎలాంటి లోపం రాకూడద ని కూడా చెప్పారు. ప్రపంచ స్థాయి సంస్థలు.. పారిశ్రామిక దిగ్గజాలు కూడా వస్తున్న నేపథ్యంలో వారి గౌర వానికి తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ఈ సదస్సు దేశంలోనే అతి పెద్దదిగా నిర్వహిం చాలని భావిస్తున్నట్టు చెప్పారు.
ఇప్పటి వరకు మహారాష్ట్ర, యూపీలలోనే అతి పెద్ద పెట్టుబడుల సదస్సును నిర్వహించారు. ఇక, గత 2014-19 మధ్య విశాఖలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా పెట్టుబడుల సదస్సు నిర్వహించింది. దానిని మించి.. ఇప్పుడు నిర్వహించనున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అంటే.. సుమారు 16 మాసాల తర్వాత.. తొలిసారి ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. దీనిని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో ఈ సదస్సుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పెట్టుబడుల సాకారంతో యువతకు ఉపాధితోపాటు.. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు యోచిస్తున్నారు.