ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల రూపురేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిలు రచిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇటీవల కొత్త జాబ్ చార్ట్ కూడా రూపొందించారు. ఆ ఉద్యోగుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలోనే తాజాగా గ్రామ, వార్డు సచివాలయాలపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మారుస్తున్నామని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై, వాటిని విజన్ యూనిట్స్ గా పిలవబోతున్నామని ప్రకటించారు.
ప్రజలకు సేవలు సమర్థవంతంగా అందించే కేంద్రాలుగా విజన్ యూనిట్లను తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ మార్పు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వచ్చిన 'స్వర్ణాంధ్ర విజన్ 2047'కు అనుగుణంగా ఉంటుందని చెప్పారు. గ్రామ సచివాలయాలను మరింత ఎఫెక్టివ్‌గా మార్చాల్సిన అవసరముందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ విజన్ యూనిట్స్ ప్రజలకు సేవందించే కేంద్రాలుగా మాత్రమే కాకుండా, గ్రామీణ వికాసానికి విజనరీ ప్లాన్‌లు రూపొందించే యూనిట్లుగా పనిచేయబోతున్నాయని తెలిపారు. అమరావతిలో డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 13,326 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. ఒక్కో దాంట్లో 13 మంది సిబ్బందిని నియమించారు. ఈ నియామకాలపై ఎన్నో వివాదాలు రావడం, 13 మందిలో సగం మందికి పెద్దగా పనిలేకపోవడం వంటి విషయాలపై విమర్శలు వచ్చాయి. దీంతో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగుల సేవలను వివిధ ప్రభుత్వ శాఖలలో ఎలా ఉపయోగించుకోవాలన్న విషయంపై చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. వివిధ శాఖల్లో ఉద్యోగులను సర్దుబాటు చేస్తూ మిగిలిన వారికి కొత్త బాధ్యతలు అప్పగించాలని మొత్తం వ్యవస్థను సంస్కరించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ విజన్ యూనిట్స్ ప్రకటన చేశారు.