జూబ్లీహిల్స్ లో జరిగిన ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పాలనలో వేగంతో పాటు రాజకీయ నిర్ణయాలు కూడా చురుగ్గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా తన ప్రభుత్వానికి ప్రతిగా నిలుస్తున్న కేటీఆర్ విషయంలో రేవంత్ తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. కేటీఆర్‌పై చర్య తీసుకోవడం రాజకీయ కక్షసాధింపుగా మారుతుందన్న విమర్శలు రాకుండా ఉండేందుకు రేవంత్ గవర్నర్ అనుమతి అనే లీగల్ రూట్ ఎంచుకోవడం చాలా స్ట్రాటజిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఫార్ములా ఈ–కారు రేస్ కేసు గత ప్రభుత్వం కాలంలోనే పెద్ద వివాదంగా మారింది. హైదరాబాద్ రోడ్లపై అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ జరిపేందుకు భారీగా ప్రభుత్వ నిధులు కేటాయించగా, ఆ నిధుల వినియోగంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. టెండర్ ప్రక్రియల నుంచి పనుల కేటాయింపుల వరకూ అన్నింటిలోనూ మోసపూరిత నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఏసీబీ ముందుకు వచ్చాయి. అయితే కేసీఆర్ హయాంలో ఈ కేసు ముందుకు సాగలేదు.
ప్రభుత్వం మారాక ఏసీబీ కేసును రీ-ఓపెన్ చేసి సాక్ష్యాలు సేకరించడం, ఫైళ్లను పరిశీలించడం వంటి దర్యాప్తు కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఇటీవలె ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏ2 గా గుర్తిస్తూ, రేవంత్ సర్కార్ విచారణకు అనుమతి కోరుతూ గవర్నర్ కు లేఖ పంపింది. అనుమతి లేకుండా ఈ స్థాయి అధికారులపై చార్జ్‌షీట్ వేయడం సాధ్యం కాదు. అందుకే గవర్నర్ అంగీకారం కీలకమైంది.
ఇక ప్రభుత్వం పంపిన లేఖకు స్పందిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేటీఆర్‌పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేసు మళ్లీ రోల్‌లోకి వచ్చింది. అవసరమైన అనుమతిని ఇప్పుడు గవర్నర్ నుంచి రావడంతో ఏసీబీ త్వరలోనే చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా చార్జ్‌షీట్‌లో కేటీఆర్ పేరు చేరితే అది బీఆర్‌ఎస్‌కు భారీ రాజకీయ నష్టం, మరోవైపు రేవంత్ ప్రభుత్వానికి పెర్ఫార్మెన్స్‌గా ప్రొజెక్ట్ చేసుకునే గొప్ప అవకాశం అవుతుంది.