కాంగ్రెస్‌కి ఓటేస్తే వాళ్లనే అడుగు.. కేటీఆర్ రిప్లైకి నెటిజ‌న్ షాక్‌!

admin
Published by Admin — November 25, 2025 in Politics, Telangana
News Image

పటాన్‌చెరు నుండి గచ్చిబౌలి-డీఎల్ఎఫ్ జోన్ వరకు ప్రయాణించే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రతిరోజూ వేలాది ఉద్యోగుల జీవితాధారాలు. ప్రత్యేకంగా ఐటీ అండ్ ఫార్మా ఉద్యోగులు ఈ రూట్‌పై బాగా ఆధారపడతారు. అయితే పటాన్‌చెరు–డీఎల్ఎఫ్ మార్గంలో నడిచే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీలు అకస్మాత్తుగా పెరగడంతో రోజువారీ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఒక నెటిజన్ ఈ సమస్యను ఎక్స్ వేదికగా ప్రస్తావిస్తూ, రూ.30 నుండి రూ.45కు ఛార్జీ పెంపు తమ వంటి ఉద్యోగులపై భారీ భారమని వాపోయాడు.

ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని కోరుతూ తన పోస్ట్‌లో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌ను ట్యాగ్ చేశాడు. “అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు ఓటు వేశాం… కానీ ఇలా ఒక్కసారిగా ఛార్జీలు పెంచడం ఏంటి? ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వ తీరును నిలదీయాల” అని కోరాడు. ఈ పోస్ట్‌పై కేటీఆర్ స్పందన సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

“మీరు నిజంగానే కాంగ్రెస్‌కు ఓటు వేసి ఉంటే… ఈ ప్రశ్నను కూడా ఆ పార్టీనే అడ‌గాలి కదా?” అని కేటీఆర్ స్ట్రైట్‌గా రిప్లై ఇచ్చారు. అయితే, ఇది ప్రజా సమస్య కావడంతో పార్టీవారీగా కాకుండా తాము తప్పకుండా గళం విప్పుతామని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు బయటకురాగానే నెటిజన్లలో చర్చ మొదలైంది. కొందరు ప్రయాణికుల సమస్యను సీరియస్‌గా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతుండగా, మరికొందరు “కాంగ్రెస్‌కు ఓటు వేసి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను ఎందుకు ప్రశ్నిస్తున్నావ్‌?” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

గత అక్టోబర్‌లో టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను ప్రభుత్వం ఇప్పటికే పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా పెంపు మళ్లీ రాజకీయ డిబేట్‌కు దారితీస్తోంది. ఒకవైపు ప్రజలు పెరిగిన ఛార్జీలతో ఇబ్బందులు పడుతుండగా… మరోవైపు సోషల్ మీడియాలో కేటీఆర్ రిప్లై చర్చకు తెరలేపింది.

Tags
KTR TSRTC Hyderabad Metro Express Bus Charges BRS Congress Telangana
Recent Comments
Leave a Comment

Related News

Latest News