ఏపీ రాజధాని అమరావతిలో చారిత్రక ముందడుగు పడింది. అమరావతి ఒక సెంట్రల్ ఆర్థిక హబ్‌గా రూపుదిద్దుకోబోతుంది. రాష్ట్రానికి ఆర్థిక శక్తిని అందించే లక్ష్యంతో, 25 ప్రముఖ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలు రాజధానిలోకి రాబోతున్నాయి. శుక్రవారం ఉదయం రాజధానిలోని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన ఉన్న సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం మొదటి బ్లాక్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదగా ఈ కీలక శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజధానిలో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్న వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, నాబార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంక్ వంటి ప్రముఖ జాతీయ సంస్థలు ఉన్నాయి.
ఈ కొత్త ఆర్థిక కేంద్రం అమరావతిని కేవలం రాజకీయ రాజధానిగా కాకుండా, ప్రధాన ఆర్థిక కేంద్రంగా కూడా నిలిపివేయనుంది. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు రావడం వల్ల, నగర అభివృద్ధి వేగవంతమవుతుంది. ఏపీసీఆర్డీఏ ప్రకారం, ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా అమరావతికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు వస్తాయి. దీంతో సుమారు 6,514 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ డెవలప్‌మెంట్ స్థానిక ప్రజలకు, వ్యాపారాలకు, రైతుల జీవన ప్రమాణాలకు బలమైన పునాది వేస్తుందని అధికారులు తెలిపారు.