ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో మళ్లీ తమ్మినేని కుటుంబం చర్చల్లో నిలుస్తోంది. మాజీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఆరోగ్య పరిస్థితి కారణంగా వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవచ్చన్న సంకేతాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆయన కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ రాజకీయ రంగప్రవేశానికి స్టేజ్ సిద్ధం అవుతోంది. కుటుంబ వారసత్వం రాజకీయాల్లో కొత్తదేమీ కాకపోయినా, దీని టైమింగ్, పరిస్థితులు, వాతావరణం మాత్రం ఈసారి పూర్తిగా వేరుగా ఉన్నాయి.
తమ్మినేని కుటుంబానికి ఆముదాలవలసలో మంచి పట్టు, బలమైన క్యాడర్ ఉన్నా.. గత ఎన్నికల తర్వాత పరిస్థితులు మారాయి. ప్రజల్లో యువ నాయకుడి కోసం డిమాండ్ పెరిగింది. ఇదే ట్రెండ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో చిరంజీవి నాగ్ ప్రమోషన్ వేగవంతం చేశారు. మీడియా ఇంటర్వ్యూలు, యూట్యూబ్ ఎక్స్‌క్లూజివ్‌లు, సోషల్ మీడియా యాక్టివిటీలను ప్రారంభించారు. బట్ ఇవి గ్రౌండ్ రియాలిటీకి ఎంత దగ్గరగా ఉన్నాయి? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ఎందుకంటే, చిరంజీవి నాగ్ ఇప్పటివరకు ఎక్కువగా మీడియా విజిబిలిటీ మీదే దృష్టి పెట్టాడు. ప్రజల్లో తిరుగుతూ సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చేయడం లేదు. అదే మైనస్‌గా మారింది. ఈ తీరు ఆయన వ్యక్తిగత ఇమేజ్ కు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ఇక వైసీపీ లోపల కూడా అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయని సమాచారం. సీతారాం ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వారసుడిని ముందుకు తేవాలన్న ఆలోచన ఉన్నా.. చిరంజీవి నాగ్ గ్రౌండ్ కనెక్ట్ పై కొందరు నేతలు డౌట్ వ్యక్తం చేస్తున్నారట.
పైగా చిరంజీవి ఎంట్రీ స్థానిక నాయకుల సామాజిక సమీకరణలపై నేరుగా ప్రభావం చూపే అవకాశముంది. కొందరు వారసత్వ రాజకీయాలకే వ్యతిరేకంగా ఉండగా, మరికొందరు అనుభవం లేని యువ నాయకుడు తమ ఓటు బ్యాంక్‌ను కదిలిస్తాడని ఆందోళన చెందుతున్నారు. అయితే చిరంజీవి నాగ్ ముందున్న అవకాశాలు కూడా చిన్నవి కావు. తండ్రి నెట్‌వర్క్, కుటుంబం మీద ప్రజల నమ్మకం, వైసీపీ నుంచి వచ్చే అధికారిక మద్దతు.. ఇవన్నీ సరిగా వినియోగించుకుంటే ఆయనకు బలమైన పాయింట్లుగా మారతాయి. కానీ గ్రౌండ్‌లో అడుగులు వేయకపోతే ఈ ప్లస్ పాయింట్లు కూడా వృథా కావచ్చు.