టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగ చైతన్య, మాజీ కోడలు సమంతలపై కాంగ్రెస్ మహిళా నేత, మంత్రి కొండా సురేఖ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే కొండా సురేఖపై నాగార్జునతో పాటు కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబంపై కొండా సురేఖ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, పరువుకు భంగం కలిగించారని నాగర్జున పిటిషన్ వేశారు.
తనపై సురేఖ నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. అయితే, నాగార్జున కుటుంబం పట్ల చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో నాగర్జున తాను వేసిన కేసును వెనక్కి తీసుకున్నారు. అయితే, కేటీఆర్ పై తాను న్యాయ పోరాటం చేస్తానని సురేఖ గతంలోనే చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది.
కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా కోర్టుకు సురేఖ గైర్హాజరు కావడంపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో కొండా సురేఖను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరచబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వారెంట్ ను కొండా సురేఖ లీగల్ గా ఏ విధంగా ఎదుర్కొంటారు అన్న విషయంపై ఆసక్తి ఏర్పడింది.