టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ స్కూల్‌.. ఎంత తేడా.. ?

admin
Published by Admin — December 12, 2025 in Politics, Andhra
News Image

సజంగా ఏ పార్టీకైనా నిర్దేశిత ప్రమాణాలు ఉంటాయి. అదే విధంగా సిద్ధాంతాలు, విధానాలు కూడా ఉంటాయి. ఈ కోణంలో చూసుకున్నప్పుడు ఏ పార్టీకైనా ఒక ప్రామాణికయుతమైన ప్రణాళికలు బాధ్యతాయుత విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. టిడిపి విషయానికి వస్తే ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఆది నుంచి అనుసరిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు పార్టీ పగ్గాలు స్వీకరించిన తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వడం, అదేవిధంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై అవగాహన కల్పించడం చేస్తున్నారు.

ప్రజల్లో ఎలా మాట్లాడాలి.. అనే విషయంలో తర్ఫీదు ఇవ్వటం.. అనేది విస్తృతంగా సాగుతోంది. గడిచిన నాలుగు నెలల్లో అనేక మంది నాయకులకు అదే విధంగా తొలిసారి ఎంపికైన ఎమ్మెల్యేలకు కూడా తరగతులు నిర్వహించారు. తద్వారా వారికి విషయపరిజ్ఞానాన్ని పెంచడంతోపాటు ప్రజల్లో ఏవిధంగా ఉండాలి ఏ విధంగా మళ్లీ మళ్లీ విజయం దక్కించుకోవాలి అనే అంశాలపై దృష్టి పెట్టారు. ఇక పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలి? పార్టీ తరఫున ఎలాంటి వాయిస్‌ వినిపించాలి.. ఏ ఏ అంశాలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలి అనే అంశాలపైనా శిక్ష‌ణ ఇచ్చారు.

ప్రత్యర్థులు చేసే విమర్శలను ఏ విధంగా బలంగా తిప్పి కొట్టాలి అనే అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు. తద్వారా టిడిపి స్కూల్ అనగానే ఒక అధ్యయన కేంద్రంగా అదేవిధంగా నాయకులను తయారు చేసే కర్మాగారంగా మారింది. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ కూడా తరచుగా చెబుతూ ఉంటారు. టిడిపి స్కూల్ కాదు టిడిపి విశ్వవిద్యాలయం దీనిలో అనేకమంది నాయకులు తయారయ్యారు.. అనేకమంది పదవులు అనుభవించారు.. ముఖ్యమంత్రులు కూడా అయ్యారని ఆయన ఒక సందర్భంలో చెప్పారు.

సో ఇప్పుడు కూడా టిడిపి అదే విధానాన్ని అనుసరిస్తుంది. ముందు ముందు కూడా ప్రజలకు చేరువయ్యేలాగా నాయకులను తయారు చేయాలని చంద్రబాబు తాజాగా సూచించారు. ఇక వైసిపి విషయానికి వస్తే ప్రత్యేక సిద్ధాంతాలు ఏమి లేకపోయినప్పటికీ ప్రజలను అజెండాగా చేసుకుని పార్టీ ముందుకు సాగుతోంది. కానీ టిడిపి తో పోల్చుకున్నప్పుడు వైసీపీలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే వివాదంగా మాట్లాడుతారో ఎవరైతే విస్తృతంగా మాస్‌కు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారో వారే నాయకులు అన్న దృష్టితో వైసిపి వ్యవహరిస్తుంది.

ఇది ఆ పార్టీకి బలం చేకూరుస్తుందని జగన్ భావిస్తున్నారు. కానీ దీనివల్ల చాలా నష్టపోతున్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. మాస్లో ఇమేజ్ ఉన్న నాయకులను తీసుకువచ్చి మీడియా ముందు నిలబెట్టడం ద్వారా లబ్ధి పొందాలన్న ఆలోచనలో వైసిపి గత నుంచి ఉంది. అందుకే కొడాలి నాని అదేవిధంగా రోజా వంటి వారు చేసిన విమర్శలు వ్యాఖ్యలను ముఖ్యంగా మాస్ జనాన్ని ఆకట్టుకునేలాగా చేసిన కామెంట్లను విస్తృతంగా ప్రచారం చేశారు. సహజంగా రాజకీయాల్లో ఇలాంటివి అప్పటికప్పుడు ఆ నిమిషానికి బాగున్నప్పటికీ విస్తృత స్థాయిలో చూసుకున్నప్పుడు వివాదానికి కేంద్రంగా మారే అవకాశం ఉంది.

బోరగడ్డ అనిల్ కుమార్ విషయం దీనికి ప్రధాన ఉదాహరణ. తీవ్ర పదజాలంతో ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు అనంతరం జరిగిన పరిణామాలు దీనికి అద్దం పడతాయి. దీనివల్ల పార్టీ సాధించింది.. ఏమీ లేకపోయినప్పటికీ పోగొట్టుకున్నది చాలా ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి టిడిపిలో ఏ విధంగా అయితే నాయకులను కార్యకర్తలను తీర్చిదిద్దుతున్నారో ఆ విధంగా వైసిపి అడుగులు వెయ్యకపోతే వైసీపీ పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉంది.

వైసీపీ స్కూల్ అంటేనే భయపడే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ తేడాను గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టిడిపిలో కూడా కొందరు వివాదాస్పద నాయకులు ఉన్నారు కాదని ఎవరూ చెప్పరు. కానీ మరింత వివాదాలకు మారే పరిస్థితి అయితే టిడిపిలో లేదు. ఎక్కడైనా తేడా వచ్చినా సరిదిద్దుకునే అగ్రనాయకత్వం ఉంది. ఈ పరిస్థితి వైసీపీలో కనిపించడం లేదు. సో ఈ పరిణామాలు నేపథ్యంలో పార్టీ అంతర్గత చర్చల ద్వారా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మార్పు దిశగా అడుగులు వేయాలి.

Tags
TDP YSRCP Ap Politics Andhra Pradesh YS Jagan Borugadda Anil Kumar
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News