దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలు, గందరగోళం.. ఇంత పెద్ద స్థాయిలో విమాన రంగంలో ఇబ్బందులు రావడం అరుదే. లక్షలాది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైన సందర్భంలో, సహజంగానే రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. అందరి వేళ్ళు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వైపే చూపాయి. కానీ ఒక యువనేతగా, జాతీయస్థాయిలో ఎదుగుతున్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడు సంయమనంతో వ్యవహరించారు. ఇండిగో సంక్షోభం వేళ విమర్శకులకు తనదైన శైలిలో చెక్‌మేట్ పెట్టారు.
ఇండిగోలో అంతర్గతంగా నెలకొన్న సమస్యను కంపెనీ చివరి నిమిషం వరకూ గోప్యంగా ఉంచడంతో దేశవ్యాప్తంగా పెద్ద గందరగోళం నెలకొంది. ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్ తీసుకున్న తప్పిదాన్ని ప్రభుత్వం భరిస్తుంది అనే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో సోషల్ మీడియా, ప్రతిపక్ష పార్టీలు, కొన్ని మీడియా ఛానళ్లు బ్లేమ్ గేమ్ మొదలుపెట్టాయి. కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు విసిరాయి. కానీ రామ్మోహన్ నాయుడు మాత్రం ఒక్క క్షణం కూడా రెస్పాన్స్ లో అసహనం, అయోమయం చూపలేదు. సమాధానాల్లో స్పష్టత, వ్యవహారశైలి లో శాంతం.. ఆయన వ్యక్తిత్వాన్ని మరింత హైలైట్ చేశాయి.
సంక్షోభాన్ని పరిష్కరించడానికి రామ్మోహన్ త్వరితగతిన చర్యలు చేపట్టారు. ఇండిగో లోపం కారణంగా నిలిచిపోయిన సర్వీసులను భర్తీ చేయడానికి 10 శాతం ఆపరేషన్లను ఇతర ఎయిర్‌లైన్స్‌కు అప్పగించడం కీలకమైంది. DGCA ద్వారా రోజువారీ సమీక్షలు, రద్దైన విమానాలపై ప్రత్యామ్నాయాల కల్పన, అత్యవసరంగా స్లాట్‌ల విడుదల వంటి చర్యలు వేగంగా అమల్లోకి రావడంతో పరిస్థితి గణనీయంగా మారింది. దేశవ్యాప్తంగా మళ్లీ ప్రయాణాలు సాధారణ స్థితికి చేరాయి.
అయితే ఇంత పెద్ద సంక్షోభాన్ని కంట్రోల్ చేసిన తరువాత కూడా రామ్మోహన్ మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఒక పెద్ద రాజకీయ సందేశం. అనుకూల మీడియాతో మాత్రమే కాదు, విమర్శక మీడియా ఛానళ్లు కూడా వరుసగా ఆయనను ఆహ్వానించాయి. టైమ్స్ నౌ నుంచి ఎన్‌డిటీవీ వరకు, ఇండియా టుడే నుంచి ఆన్‌లైన్ డిబేట్‌ల వరకు.. ఎక్కడైనా అడిగిన ప్రశ్నలకు ఫ్యాక్ట్స్‌తోనే స్పందించారు. అవమానకర వ్యాఖ్యలు వచ్చినా, స్మార్ట్‌గా, శాంతంగా, ఆధారాలతో సమాధానమిచ్చారు. బిజెపిని వ్యతిరేకించే రాజీవ్ సర్దేప్ శాయి కూడా రామ్మోహన్‌ను అభినందించడం ఆయన చర్యలకు వచ్చిన అప్రూవల్ అని చెప్పాలి.
మొత్తానికి కేంద్రంలో యువ టీడీపీ మంత్రి చేసిన పనితీరు జాతీయ దృశ్యపటంలో మంచి ఇంప్రెషన్‌ను తీసుకొచ్చింది. కేవలం విమర్శలకు ప్రతిస్పందించడమే కాదు, సంక్షోభంలోనూ లీడర్‌షిప్ ఎలా ఉండాలో చూపించాడు రామ్మోహన్. పాలనలో తప్పులు రావచ్చు, కానీ వాటిని దాచడంలో కాదు. సరిదిద్దడంలో నాయకుడి అసలైన సామర్థ్యం తెలుస్తుందని ఆయన నిరూపించారు.