వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పార్టీ వ్యూహాలకు ప్రాణం పోసిన నాయకుడు విజయసాయిరెడ్డి. జగన్‌కు అతి నమ్మకస్థుడిగా పేరుపొందిన ఆయన.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడాయన నడుస్తున్న దారి..పూర్తిగా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనే ఉంది.
తాజాగా విజయసాయి రెడ్డి హిందూ ధార్మిక సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యాన్ని తొలగించి, వాటికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కొత్తది కాదు..ఇదే విషయం పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా బలంగా ప్రస్తావిస్తున్నారు. ఇతర మతాలకు సంబంధించిన సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చిన మాదిరిగానే.. హిందూ మత ధార్మిక సంస్థలకు సైతం వర్తింపజేయాలన్నది పవన్ అభిమతం. దీనిపైనే ఆయన గట్టి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు అదే గొంతు విజయసాయిరెడ్డిలో వినిపిస్తుండటం ఒక పెద్ద పొలిటికల్ ట్విస్ట్‌గా మారింది.
వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్‌పై విజయసాయి రెడ్డి చేసిన విమర్శల స్థాయి అందరికీ తెలిసిందే. జగన్ మెప్పు కోసం పవన్‌ను అనరాని మాటలు అన్నారు. అయితే ఇప్పుడు అదే వ్యక్తి పవన్ కళ్యాణ్ అభిమతమే తనది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా `పవన్ కళ్యాణ్ తో నాకు 20 ఏళ్ల పరిచయం ఉంది` అని చెప్పడం, `నేను ఆయన అభిమానిని` అని ప్రకటించడం రాజకీయంగా ఒక కొత్త సంకేతాన్ని ఇస్తోంది. విమర్శల దశను దాటి, ప్రశంసల దశలోకి రావడం వెనుక లోతైన రాజకీయ లెక్కలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
అయితే విజయసాయి రెడ్డి అకస్మాత్తుగా పవన్ కి దగ్గరవ్వడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రాష్ట్ర రాజకీయ వాతావరణం మారుతున్న నేపథ్యంలో స్వీయ రక్షణ కోసం పవన్ వైపు చూస్తున్నారా? లేక రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా జనసేనలో చేరేందుకు ఇది ఆయన చేస్తున్న ప్రయత్నమా? అన్నది తెలియాలి.