వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీని పుంజుకునేలా చేయాలన్నది ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఉద్దేశం. వచ్చే 2029 ఎన్నికల నాటికి కడపలో క్లీన్ స్వీప్ చేయాలని కూడా ఆయన భావిస్తు న్నారు. కుదిరితే.. పులివెందులలో జగన్‌ను కూడా ఓడించి ఇంటికే పరిమితం చేస్తామని.. ఈ ఏడాది మహానాడులో ప్రకటించారు. గత నెలలో జరిగిన స్థానిక ఉప ఎన్నికలో కడపలో వైసీపీని ఓడించారు. బలమైన నాయకులకు బాధ్యతలు కూడా అప్పగించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పటికే ఉన్న వర్గపోరుతో టీడీపీ ఇబ్బందులు పడుతోంది. కీలకమైన రెండు సామాజిక వర్గాల నాయకుల మధ్య టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఆధిపత్య ధోరణులు పెరిగి.. రోజుకో పంచాయతీ తెరమీదికి వస్తోంది. ముఖ్యంగా కడప ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డప్పగారి మాధవీ రెడ్డి.. దూకుడుతో చాలా మంది నాయకులు ఇబ్బంది పడుతున్నారని జిల్లాలోనే కాదు.. పార్టీలోనూ చర్చ ఉంది. ఇక, ఆమె భర్త, పార్టీ జిల్లా అధ్యక్షుడు.. రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి కూడా.. దూకుడుగానే ఉన్నా.. కొంత మేరకు బెటర్ అనేలా ఉన్నారు.
కానీ..ఇప్పుడు పార్టీ తీసుకున్న కీలక నిర్ణయంతో కడపలో మరోసారి మరింతగా వర్గపోరు పెరిగే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప పార్లమెంటు స్థానం అధ్యక్షుడిగా.. చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి తాజాగా పగ్గాలు అప్పగించారు. అంటే.. ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డిని పార్టీ పక్కన పెట్టింది. ఈ వ్యవహారం.. రెడ్డప్పగారి కుటుంబంలో కాక రేపుతోంది. నిన్నటి వరకు.. మార్పు లేదని చెప్పారని.. ఇప్పుడు మార్పు చేయడం ఏంటన్నదివీరు అడుగుతున్న ప్రశ్న.
ఇక, మరోవైపు.. చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి.. ఎమ్మెల్యే వర్గానికి మధ్య ఆది నుంచి పోరు సాగుతోంది. గత ఎ న్నికల్లో కడపలో భూపేష్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. ఇదేసమయంలో మాధవీరెడ్డి విజయం దక్కించు కున్నారు. ఫలితంగా ఈ గ్యాప్ మరింత పెరిగింది. తరచుగా వివాదాలు.. విభేదాలు కూడా తెరమీదికి వస్తు న్నాయి. ఇలాంటి సమయంలో కీలక మార్పు చేయడం ద్వారా.. టీడీపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలను మరింత పెంచినట్టు అయింది అంటున్నారు పరిశీలకులు. ఇదిలావుంటే.. బీజేపీలోకీలక నాయకుడి సిఫారసుతోనే భూపేష్‌కు ఈ పదవి ఇచ్చారన్న వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం.