ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక రాజకీయ చాతుర్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి వరుసగా ప్రాధాన్యం లభిస్తోంది. ఏపీ ప్రయోజనాలే కాదు.. పార్టీ పరంగా కూడా టీడీపీకి కేంద్రం నుంచి బలమైన మద్దతు అందుతున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం స్పష్టమైన సహకారం అందిస్తుండగా.. భాగస్వామ్య పార్టీగా టీడీపీకి ఒక గవర్నర్ పోస్టు కూడా దక్కిన సంగతి తెలిసిందే.
పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించడం ద్వారా ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీకి కేంద్రంలో మరో కీలక పదవి దక్కడం విశేషంగా మారింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, టీడీపీ లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు కనకమెడల రవీంద్ర కుమార్‌ను అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా కేంద్రం నియమించింది. ఇది కేంద్ర న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయి బాధ్యతగా పరిగణించబడుతుంది. అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక కేసులు, హై ప్రొఫైల్ అంశాలపై వాదనలు వినిపించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, పథకాలపై న్యాయపరమైన రక్షణ కల్పించే బాధ్యత ఈ పదవికి ఉంటుంది.
టీడీపీ లీగల్ సెల్‌ను సుదీర్ఘకాలం నడిపిన అనుభవం, న్యాయ రంగంలో ఉన్న లోతైన అవగాహన కారణంగా రవీంద్ర కుమార్‌కు ఈ అవకాశం దక్కిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు నాయుడు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆరు సంవత్సరాలపాటు ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించిన రవీంద్ర కుమార్ ఇటీవలే పదవీ విరమణ చేశారు. అయితే పదవీ విరమణ చేసిన కొద్ది నెలలకే కేంద్రం ఆయన ప్రతిభను గుర్తించి అడిషనల్ సొలిసిటర్ జనరల్ వంటి హై పవర్ పోస్టు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నియామకం వెనుక చంద్రబాబు నాయుడి సిఫారసు కీలకంగా పనిచేసిందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.