పులివెందులలో ఈసారి క్రిస్మస్ వేడుకలు కేవలం మతపరమైన కార్యక్రమంగా కాకుండా… రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా హాట్ టాపిక్‌గా మారాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి క్రిస్మస్ అంటే చాలా ప్రత్యేకం. ఎక్కడ ఉన్నా క్రిస్మస్ నాడు కుటుంబమంతా పులివెందుల చేరడం ఒక ఆనవాయితీగా మారింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఈ సంప్రదాయం మరింత బలపడింది. అయితే ఇటీవల కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు, రాజకీయ పరిణామాలు, చివరకు షర్మిల-జగన్ మధ్య విభేదాలు… ఇవన్నీ కలిసి కుటుంబంలో స్పష్టమైన చీలికను తెచ్చాయి.
కారణం ఏదైనప్పటికీ జగన్, షర్మిల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పొలిటికల్ గా షర్మిల పూర్తిగా వేరే దారి పట్టడంతో ఇద్దరూ కలిసే అవకాశం లేదన్న అభిప్రాయం బలంగా వినిపించింది. కానీ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి జన్మదినం నాడు షర్మిల సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి జగన్ కూడా థాంక్యూ షర్మిలమ్మ అంటూ ఆప్యాయంగా రిప్లై ఇవ్వడం మరో హైలెట్. దీంతో జగన్, షర్మిల మధ్య విభేదాలు తొలగిపోతున్నాయనే ప్రచారం ఊపందుకుంది.
ఇప్పుడీ క్రిస్మస్ వేడుకలు ఆ ఊహలకు మరింత ఇంధనం పోశాయి. పులివెందుల పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి క్రిస్మస్ ప్రార్థనలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే ఫ్రేమ్‌లో జగన్, భారతి, తల్లి విజయమ్మ, జగన్ కూతుళ్లతో పాటు ఇతర కుటుంబ సభ్యులంతా కనిపించారు. అయితే ఈ ఫోటోలో షర్మిల ఎక్కడా కనిపించలేదు. కానీ, ఆమె కుమారుడు మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి, భారతి రెడ్డి పక్కనే కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో షర్మిల కుమారుడు కుటుంబంతో కలిసి కనిపించడం యాదృచ్ఛికమా? లేక తెరవెనుక ఏదైనా సర్దుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయా? జగన్–షర్మిల మధ్య మంచు కరుగుతుందా? ఇద్దరూ మెల్లమెల్లగా దగ్గరవుతున్నారా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇదే తరుణంలో కుటుంబ పెద్దలు, శ్రేయోభిలాషులు ఇద్దరినీ దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది.