ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ గ్రేటర్ సిటీ చర్చ తెరపైకి వచ్చింది. ఈసారి ఫోకస్ అంతా విజయవాడపైనే ఉంది. అమరావతి రాజధాని అభివృద్ధి ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యూహాలపై ఆలోచిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు, ఐటీ కంపెనీలు, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పుడు బెజవాడను గ్రేటర్ సిటీగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోందన్న ప్రచారం ఊపందుకుంది.
అమరావతి చుట్టూ నవనగరాల నిర్మాణం చంద్రబాబు కల. అయితే నగరానికి ఇంకా స్పష్టమైన రూపురేఖలు రాకపోవడం, పెట్టుబడుల రాకలో జాప్యం వంటి అంశాలు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాల వైపు చూపు మళ్లేలా చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే వాణిజ్య, రవాణా కేంద్రంగా ఎదిగిన విజయవాడపై ప్రత్యేక దృష్టి పడింది. విజయవాడ–గుంటూరు–అమరావతి త్రిభుజాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన నుంచి ఇప్పుడు విజయవాడను కేంద్రంగా చేసుకుని గ్రేటర్ మోడల్ అమలు చేయాలన్న ఆలోచన బలపడుతున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన అమలైతే దాదాపు 75 గ్రామపంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేయనున్నారు. ఇప్పటికే 2017లో 51 పంచాయితీల విలీనంపై ప్రతిపాదన ఉండగా, ఇప్పుడు మరో 24 పంచాయితీలు జాబితాలో చేరాయి. దీంతో విజయవాడ జనాభా ప్రస్తుతం ఉన్న 23.5 లక్షల నుంచి దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. నగర విస్తీర్ణం కూడా 61.8 చదరపు కిలోమీటర్ల నుంచి ఏకంగా 500 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుందని అంచనా.
ఈ విస్తరణతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ సివిక్ బాడీగా అప్గ్రేడ్ చేయాలని అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఐటీ హబ్‌లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, రింగ్ రోడ్లు, మెట్రో తరహా రవాణా సదుపాయాల వంటి పెద్ద ప్రాజెక్టులకు గ్రేటర్ హోదా కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ వస్తే విశాఖపట్నాన్ని దాటి రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా విజయవాడ అవతరించే అవకాశం ఉంది.
అయితే ఈ గ్రేటర్ ప్లాన్‌పై వ్యతిరేకత కూడా అదే స్థాయిలో వ్యక్తమవుతోంది. గ్రామాలను నగరంలో విలీనం చేయకుండా వికేంద్రీకరణ కావాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. పౌర సంఘాలు, కొన్ని వర్గాలు ఈ ప్రతిపాదన వల్ల గ్రామీణ స్వరూపం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం గట్టిగా నిలబడి గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనను అమలు చేస్తే బెజవాడ ముఖచిత్రమే మారిపోతుందన్న మాట వినిపిస్తోంది.