ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మారుతోంది. కొత్త ఏడాది నుంచి పాలనలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. జిల్లాల విభజనపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం చేసిన విభజనలో లోపాలను సరిదిద్దుతూ, ప్రజల సౌలభ్యమే పరమావధిగా 17 జిల్లాల్లో ఏకంగా 25 కీలక మార్పులు చేస్తూ తుది మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ మార్పులన్నీ జనవరి 1 నుంచే అమల్లోకి రానున్నాయి.
రెండు కొత్త జిల్లాల ఆవిర్భావం..
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను ప్రకటించింది. పోలవరం, మార్కాపురం ప్రాంతాలను స్వతంత్ర జిల్లాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు వీలుగా పోలవరం జిల్లాను ప్రకటించారు.
మరోవైపు రాయలసీమ జిల్లాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉన్నప్పటికీ, జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్ మేరకు రాజంపేట నియోజకవర్గాన్ని తిరిగి అన్నమయ్య జిల్లా నుంచి కడప జిల్లాలోకి చేర్చారు. అలాగే తిరుపతి జిల్లాలో కలవాలన్న రైల్వేకోడూరు ప్రజల చిరకాల వాంఛను ప్రభుత్వం నెరవేర్చింది.
కేవలం జిల్లాలే కాదు, డివిజన్ల విషయంలోనూ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రజలు దూరభారం తగ్గించుకునేందుకు వీలుగా బనగానపల్లె, అడ్డరోడ్డు ప్రాంతాలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అటు కర్నూలు జిల్లాలోని ఆదోనిని కూడా రెండు మండలాలుగా విభజించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఏపీలోని 26 జిల్లాల్లో 9 జిల్లాలను యథాతథంగా ఉంచి, మిగిలిన 17 జిల్లాల్లో ఈ సమూల మార్పులు చేపట్టారు.