జగన్ హయాంలో వైసీపీ పబ్లిసిటీ పిచ్చి తీవ్ర స్థాయిలో విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. చెట్టుకు, పుట్టకు వైసీపీ రంగులు వేయడం మొదలు పట్టాదారు పాసు పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర స్థానంలో జగన్ ఫోటో ముద్రించడం వరకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలను తొలగిస్తామని ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి హామీనిచ్చింది. ఆ మాట నిలబెట్టుకుంటూ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేపట్టామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
రైతులకు తమ ప్రభుత్వం అందిస్తున్న నూతన సంవత్సర కానుక ఇది అని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగానే తప్పులను సరిదిద్ది జగన్ ఫోటో తీసేసి రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేపట్టారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాస్ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జనవరి 2వ తారీకు నుంచి 9 వ తారీకు వరకు ఈ పంపిణీ జరగనుంది.
ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా ఈ పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీలో సీఎం చంద్రబాబు స్వయంగా ఒక రోజు పాల్గొనబోతున్నారు. గతంలో మాదిరిగా రాజముద్రతో ఉన్న పాసు పస్తకాల పంపిణీ చేపట్టిన కూటమి ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.