ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు వైభవంగా జరుపుకునే అతి పెద్ద పండుగలో సంక్రాంతి ముందుంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఏటా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీంతో, సంక్రాంతికి ముందు సంక్రాంతి తర్వాత మొత్తం వారం రోజులపాటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సమయంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజు లేకుండా వాహనాలను పంపించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్గరీకి తెలంగాణ రవాణా శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. టోల్ ఫ్రీ చేస్తే వాహనాల రద్దీ లేకుండా ట్రాఫిక్ జాం కాకుండా ఉంటుందని అన్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంక్రాంతి సందర్భంగా ఫ్రీ టోల్ కు అనుమతించాలని టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మరి, ఈ వ్యవహారంపై గడ్కరీ స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.