2019-24 మధ్యకాలంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఏపీ సీఎంగా జగన్ ఉన్నపుడు ఈ ఇద్దరు నేతల మధ్య అండర్ స్టాండింగ్ వేరే లెవల్లో ఉంది. ఆ సమయంలో తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్రాకు కేసీఆర్ మేలు చేశారని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో తీరని అన్యాయం చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ విషయం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. జగన్ తో దోస్తీ చేసిన కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
ఏపీ మాజీ సీఎం జగన్ తో అలయ్ బలయ్ అంటూ తిరిగిన వాళ్లు...కృష్ణా జలాల్లో 3 టీఎంసీ నీళ్లు డైవర్ట్ చేసినా మాట్లాడలేదని ఉత్తమ్ దుయ్యబట్టారు. ప్రతి రోజు కలిసి కూర్చున్న వాళ్లు 45 టీఎంసీలు డయాఫ్రం తెలంగాణకే రావాలి అని ఏపీని ఒప్పించి తెచ్చి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఈజీ అయ్యేదని అన్నారు. వాళ్ల వైఫల్యాలు, తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో, కేసీఆర్, జగన్ లను ఉత్తమ్ అసెంబ్లీలో ఉతికి ఆరేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.