టీడీపీ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా వ్యవహరించే రఘురామ తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. నాటకాలలో కూడా రఘురామకు ప్రవేశం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనలో ఉన్న మరో కోణాన్ని కూడా రఘురామ బయటపెట్టారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన భీమవరం బీట్ అనే వీడియో సాంగ్ లో రఘురామ స్టెప్పులు వేసి అలరించారు.
తెలుగు పాప్ సింగర్ స్మిత, ర్యాపర్ నోయల్ తో కలిసి రఘురామ రచ్చ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. సంక్రాంతి సందర్భంగా భీమవరం బీట్ పాటను స్మిత రూపొందించారు. స్మిత, నోయల్ ఈ పాటకు సాహిత్యం అందించి సంగీతం కూడా సమకూర్చి పాడారు. సంక్రాంతి పండుగ వాతావరణం ఉట్టిపడేలా హై ఎనర్జీ బీట్స్ తో ఈ పాట సాగింది.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాపులర్ స్టెప్పులు కూడా ఈ పాటలో ఉన్నాయి. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ వీడియో సాంగ్‌లో స్మిత, నోయల్ డ్యాన్స్ ఇరగదీశారు. వారికి రఘురామ జోష్ కూడా తోడవడంతో ఆ పాట మరింత వైరల్ అవుతోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో ఆ సాంగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సంక్రాంతికి భీమవరం బీట్ కు కుర్రకారు ఫిదా కావడం ఖాయంగా కనిపిస్తోంది.