తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం ఇచ్చే `స్త్రీనిధి` రుణాల రికవరీ విషయంలో ఇకపై ఉదాసీనత ఉండబోదని స్పష్టం చేసింది. మొండి బకాయిల వసూలు కోసం అత్యంత కఠినమైన రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించడంతో సభ్యుల్లో ఆందోళన మొదలైంది.
సాధారణంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు లేదా బకాయిలు ఆగిపోయినప్పుడు ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు స్త్రీనిధి రుణాలకు కూడా దీనిని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం, రుణం తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించని వారిని డిఫాల్టర్లుగా పరిగణిస్తారు. అధికారులకు సదరు సభ్యురాలి ఇంటిని, భూమిని లేదా ఇతర విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకుని జప్తు చేస్తారు. అలా జప్తు చేసిన ఆస్తులను బహిరంగంగా వేలం వేసి, ఆ వచ్చిన డబ్బుతో అప్పును జమ చేసుకుంటారు.
ఒకవేళ రుణం తీసుకున్న మహిళ పేరు మీద ఎలాంటి ఆస్తులు లేనట్లయితే, ప్రభుత్వం ఊరుకోదు. ఆ గ్రూప్‌లో ఉన్న మిగిలిన సభ్యులపై ఆ బాధ్యత పడుతుంది. సంఘం అంటేనే ఉమ్మడి బాధ్యత అనే సూత్రం ఆధారంగా.. ఒకరు అప్పు కట్టకపోయినా, ఆ గ్రూపులోని ఇతర సభ్యుల ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఈ చట్టం కల్పిస్తోంది. దీనివల్ల గ్రూపులో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే, మిగిలిన వారు కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఈ చట్టంలో పొందుపరిచిన ఒక నిబంధన ఇప్పుడు మహిళా సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా, ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఈ మొండి బకాయిల సమస్య అధికంగా కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా దాదాపు 60 వేల మంది సభ్యులు ఉండగా, వారిలో చాలామంది రూ. 30 వేల నుంచి రూ. 3 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. అయితే, ఇప్పటివరకు సుమారు రూ. 23 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఈ భారీ బకాయిలను చూసే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.