తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గత దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పార్టీలో కీలక శక్తిగా, కేసీఆర్ నీడగా ఉన్న ఎమ్మెల్సీ కవిత.. సొంత పార్టీపైనే యుద్ధం ప్రకటించారు. సోమవారం శాసనమండలి వేదికగా ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కేవలం పదవికి రాజీనామా చేయడమే కాకుండా, పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
``నా ఇద్దరు కొడుకుల మీద ఒట్టు.. బీఆర్ఎస్‌తో నాది ఆస్తుల పంచాయితీ కాదు.. ఆత్మగౌరవ పంచాయితీ`` అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆమెలో గడిచిన మూడేళ్లుగా గూడుకట్టుకున్న ఆవేదనను బయటపెట్టాయి. ఈడీ విచారణలు, జైలు జీవితం వంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ తనకు అండగా నిలవలేదని ఆమె బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నడుస్తున్న తీరును, పార్టీ రాజ్యాంగాన్ని ఒక పెద్ద జోక్ అని అభివర్ణించడం రాజకీయంగా చర్చకు దారితీసింది.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడాన్ని తాను అప్పట్లోనే వ్యతిరేకించానని, పార్టీ పతనానికి జాతీయ రాజకీయాల ఆకాంక్షే కారణమని కవిత పరోక్షంగా నొక్కి చెప్పారు. తెలంగాణ గడ్డపై బలం కోల్పోయి, జాతీయ రాజకీయాల పేరుతో సాధించిందేమిటని ఆమె ప్రశ్నించడం కేసీఆర్ వ్యూహాలనే తప్పుబట్టినట్లు అయింది.
ఇక ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి గురైన కవిత, కన్నీరు పెట్టుకుంటూనే తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు.`` ఈ మండలిలో ఇదే నా చివరి ప్రసంగం. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను.. కానీ మళ్లీ చట్టసభల్లోకి ఒక బలమైన శక్తిగా వస్తాను`` అని ఆమె సంచలన శపథం చేశారు. అదే సమయంలో పార్టీలో సీనియర్ల తీరుపై ఆమె తనకున్న అసంతృప్తిని బయటపెట్టారు. పార్టీలో నైతికత నశించిందని, కేసీఆర్‌ను కనీసం కాపాడుకోలేని స్థితిలో నాయకత్వం ఉందని, కేసీఆర్‌ను విమర్శిస్తే పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్‌ను కాపాడుకోలేని పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? అంటూ కవిత మండిపడ్డారు.