టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటే తెలియని వారుండరు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఆయన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా తన మొదటి భార్య అనిత మరణం తర్వాత, 2020లో తేజస్విని (వైఘా రెడ్డి)ని ఆయన రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఈ పెళ్లిపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. కేవలం ఆస్తి కోసమే ఆమె దిల్‌రాజును పెళ్లి చేసుకుందని కొందరు, వయసు వ్యత్యాసం గురించి మరికొందరు దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఈ విమర్శలపై తేజస్విని తమ్ముడు, డాక్టర్ తరుణ్ ఉండవల్లి స్పందిస్తూ సంచలన విషయాలను బయటపెట్టారు.
సోషల్ మీడియాలో వచ్చిన నెగెటివ్ కామెంట్స్‌పై తరుణ్ గట్టిగానే స్పందించారు. ``మా అక్క కేవలం దిల్‌రాజు గారి ఆస్తి చూసే పెళ్లి చేసుకుందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ అందులో అస్సలు నిజం లేదు. మా కుటుంబం కూడా ఆర్థికంగా చాలా స్థిరంగా ఉంది. నేను డాక్టర్‌ని, మా అమ్మ, తమ్ముడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. మా నాన్నగారు పెద్ద బిజినెస్‌మెన్. డబ్బు పరంగా మాకు ఎలాంటి లోటు లేదు. కాబట్టి ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మా అక్కకు లేదు`` అంటూ నోరు మూయించే క్లారిటీ ఇచ్చారు.
అలాగే ఈ పెళ్లి విషయంలో మరో షాకింగ్ విషయాన్ని తరుణ్ పంచుకున్నారు. ఈ సంబంధం వచ్చినప్పుడు తమ ఇంట్లో మొదట ఎవరూ ఒప్పుకోలేదట. ముఖ్యంగా వారి అమ్మమ్మ పాతకాలం మనిషి కావడంతో, ఆమెను ఒప్పించడం చాలా కష్టమైందట. కేవలం తన అక్క సంతోషం కోసమే ఈ పెళ్లి జరిపించామని తెలిపారు. ఇకపోతే తేజస్విని ఎయిర్ హోస్టెస్ కాదని తరుణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆమె మెడికల్ విభాగంలో చదువుకుందని, అనుకోకుండా ఒక ఎయిర్ లైన్స్ సంస్థలో ఉద్యోగం చేసిందని చెప్పారు. ఆ సమయంలోనే విమాన ప్రయాణాలు చేసే దిల్‌రాజుతో ఆమెకు పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయమే చివరికి పెళ్లి వరకు దారితీసిందని పేర్కొన్నారు.
చివరగా తన బావ దిల్‌రాజు గురించి చెబుతూ.. ``ఆయన చాలా మంచి మనిషి. బయట ప్రపంచం ఆయన్ని ఎలా చూసినా, మా దృష్టిలో ఆయన బంగారం. మా అక్కను ఒక మహారాణిలా చూసుకుంటున్నారు. వారిద్దరినీ కలిపింది విధి అని నేను నమ్ముతాను`` అంటూ తరుణ్ చెప్పుకొచ్చారు. అన్నట్లు దిల్‌రాజు, తేజస్విని లది కులాంతర వివాహం. తేజస్విని బ్రాహ్మణులు కాగా.. దిల్‌రాజు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు.