ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో పెను తుపాను ముంచుకొస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా తగ్గకముందే, రాష్ట్రం మరో మినీ సమరానికి సిద్ధమవుతోందా అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వరుసగా గైర్హాజరవుతున్న వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై శాసనసభ ఎథిక్స్ కమిటీ కొరడాతో సిద్ధమవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సభకు గైర్హాజరైతే సదరు సభ్యత్వంపై అనర్హత వేటు వేసే అధికారం సభకు ఉంటుంది. ప్రస్తుతం వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇదే గండం అంచున ఉన్నారు. సభకు రాకుండానే జీతభత్యాలు పొందుతున్నారనే అంశంపై ఎథిక్స్ కమిటీ ఇప్పటికే సీరియస్ అయింది. ప్రజాధనాన్ని తీసుకుంటూ ప్రజాస్వామ్య దేవాలయానికి రాకపోవడాన్ని నైతిక తప్పిదంగా పరిగణిస్తూ, వారిపై అనర్హత వేటు వేయాలని కమిటీ సిఫారసు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
రాబోయే బడ్జెట్ సమావేశాలే ఈ సంచలనానికి వేదిక కానున్నాయి. ఎథిక్స్ కమిటీ ఇచ్చే నోటీసులకు వైసీపీ ఎమ్మెల్యేలు ఇచ్చే సమాధానంపైనే వారి భవితవ్యం ఆధారపడి ఉంది. ఒకవేళ వేటు పడితే మాత్రం, ఏపీ పాలిటిక్స్ మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడం ఖాయం. వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీని కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉంది. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఓట్లేస్తే, సభకు రాకుండా పారిపోతున్నారంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ ఉపఎన్నికలు వస్తే, వైసీపీ ఎమ్మెల్యేల బాధ్యతారాహిత్యాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుని, ఆ ఆరు స్థానాలను కూడా క్లీన్ స్వీప్ చేయాలని కూటమి భావిస్తోంది.
మరోవైపు తన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే వైఎస్ జగన్ ఊరికే ఉంటారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజంగా ఆరుగురు ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తే, దానికి నిరసనగా తన వద్ద ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరే దిశగా జగన్ నిర్ణయం తీసుకోవచ్చు. తద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను నిరూపించే అవకాశం వైసీపీకి దొరుకుతుంది.