రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పేరు ప్రధానంగా వినిపించటం.. ఆ ఆరోపణల్ని ఆయనఖండించటమే కాదు.. అదేమీ పెద్ద విషయం కాదన్నట్లుగా తేల్చేశారు. అయితే.. ఈ వ్యవహారం అంతకంతకూ ముదిరి.. విచారణ వరకు వచ్చింది. ఏసీబీ ఎంట్రీ తర్వాత తెర మీదకు ఈడీ కూడా రంగంలోకి దిగటం.. దీనికి తోడు ఈ రేసింగ్ వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలు బయటకు వస్తున్న నేపథ్యంలో.. రేసింగ్ ఉదంతానికి సంబంధించిన కేసు పట్టుబిగుసుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు వర్గాలు డిసెంబరు 31న వాదనలు ముగించారు. ఈ రోజు తీర్పు వెలువరించారు. కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఏసీబీ తరఫు ఏజీ ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని పేర్కొన్నారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.46 కోట్లు చెల్లించారన్నారు.