ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వేదికగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిర్వహించిన పర్యటన దిగ్విజయంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ సదస్సులో ఏపీ బృందం కేవలం చర్చలకే పరిమితం కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును మార్చే భారీ పెట్టుబడులను ఖరారు చేసుకుని తిరుగుపయనమైంది.
ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం అమరావతి స్పోర్ట్స్ సిటీ. రాజధానిలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు రతన్ టాటా సంస్థ ముందుకు రావడం ఏపీకి దక్కిన పెద్ద విజయం. అటు విశాఖపట్నాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చే దిశగా క్యాప్ జెమినీ సంస్థతో ఒప్పందం కుదిరింది. అక్కడ ఇంటిగ్రేటెడ్ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్‌తో పాటు క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక సాంకేతికతపై ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేసేందుకు ఈ సంస్థ అంగీకరించింది.
ఉపాధి వేటలో ఉన్న యువతకు ఈ దావోస్ పర్యటన తీపి కబురు అందించింది. విజయవాడలో టెక్ మహీంద్రా తన ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా ఏకంగా 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా, విశాఖలో 3,000 మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్లింగ్ క్యాంపస్‌ను కూడా ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. గ్లోబల్ ఇన్వెస్టర్ బ్లాక్ స్టోన్ సైతం విశాఖలో ఆఫీస్ స్పేస్ మరియు మల్టీ పర్పస్ డెవలప్‌మెంట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేవలం ఫ్యాక్టరీలు, ఆఫీసులే కాకుండా డిజిటల్ టాలెంట్ పైప్‌లైన్ నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఏఐ (AI), క్లౌడ్ టెక్నాలజీ వంటి రంగాల్లో మన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యం కావడం విశేషం. మొత్తం మీద, దావోస్ సదస్సు ఏపీకి కేవలం పెట్టుబడులనే కాకుండా, రాబోయే ఐదేళ్ల అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ పర్యటన ప్రభావంతో ఏపీలో త్వరలోనే పారిశ్రామిక కోలాహలం మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.