సాయిరెడ్డి వ‌ర్సెస్ స‌జ్జ‌ల‌.. జగన్ అడుగులు ఎవ‌రివైపు?

admin
Published by Admin — January 24, 2026 in Politics, Andhra
News Image

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒకటే చర్చ.. పార్టీ పునాదుల నుంచి ఉన్న నమ్మకమా లేక గత ఐదేళ్లుగా అధికారాన్ని శాసించిన కోటరీయా? పార్టీ ఆవిర్భావం నుండి జగన్ మోహన్ రెడ్డికి నీడలా ఉండి, 2019లో అఖండ విజయానికి తెరవెనుక చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు తన సొంత పార్టీలోని ఒక వర్గంపై బహిరంగంగానే యుద్ధం ప్రకటించడం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని కోటరీనే విజయసాయిరెడ్డి టార్గెట్. 2024 ఎన్నికల ఘోర పరాజయానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయి కార్యకర్తలకు, జగన్‌కు మధ్య ఈ కోటరీ ఒక గోడలా నిలబడటమేనని సాయిరెడ్డి వర్గం బలంగా నమ్ముతోంది. ``కనీస రాజకీయ పరిజ్ఞానం లేని వారు జగన్‌ను తప్పుదోవ పట్టించారు`` అని సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నేరుగా సజ్జల టీమ్‌ను ఉద్దేశించినవే. క్షేత్రస్థాయిలో కేడర్ కూడా సాయిరెడ్డి వాదనతో ఏకీభవిస్తున్నట్లు కనిపిస్తోంది. 

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బూత్ లెవల్ వరకు యంత్రాంగాన్ని నడిపించిన సాయిరెడ్డి అనుభవం ఇప్పుడు పార్టీకి అవసరమనే చర్చ మొదలైంది. అయితే, గత ఐదేళ్లుగా తన ప్రతి నిర్ణయంలోనూ భాగస్వామిగా ఉన్న సజ్జల టీమ్‌ను జగన్ అంత తేలికగా పక్కన పెడతారా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవైపు విధేయతకు మారుపేరుగా ఉంటూ, సంస్థాగత నిర్మాణంపై పట్టున్న విజయసాయిరెడ్డి.. మరోవైపు గత ఐదేళ్లుగా పార్టీ వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లో నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ ముందు రెండే రెండు డెడ్లీ ఆప్ష‌న్స్ ఉన్నాయి. పాత మిత్రుడిని నమ్మి, కోటరీని ప్రక్షాళన చేసి పార్టీకి కొత్త ఊపిరి పోయడం. లేదా ప్రస్తుతమున్న టీమ్‌తోనే సర్దుకుపోతూ, అంతర్గత విభేదాల మధ్యే పోరాడటం. 2029 లక్ష్యంగా అడుగులు వేయాలంటే జగన్ ఖచ్చితంగా ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే. సాయిరెడ్డి ఆఫర్‌ను స్వీకరిస్తే అది పార్టీలో ఒక పెనుమార్పుకు సంకేతం అవుతుంది. ఒకవేళ మళ్ళీ సజ్జల కోటరీకే ప్రాధాన్యత ఇస్తే, సాయిరెడ్డి వంటి సీనియర్ నేత భవిష్యత్తు అడుగులు ఎటువైపు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారుతుంది. 

Tags
YSRCP YS Jagan Vijayasai Reddy Sajjala Ramakrishna Reddy AP Politics Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News